ధరల మోత!

– అమాంతం పెరిగిన కూరగాయల ధరలు
– ఆరు నెలలుగా సామాన్యుడికి అందని అల్లం వెల్లుల్ల్లి
– మంట పుట్టిస్తున్న టమాట, పచ్చిమిర్చి, బీన్స్‌, చిక్కుడు
– బియ్యం, కంది పప్పు ధరలూ పైపైకి
– స్వల్పంగా పెరిగిన నూనెల ధరలు
నవతెలంగాణ -పెద్దవూర
రోజురోజుకూ పెరుగుతున్న ధరలు వంటింట్లో కుంపటి లేపుతున్నాయి. ఏ నిత్యావసర వస్తువు కొందామన్నా వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రతీ ఇంట్లో సాధారణంగా వినియోగించే టమాట ధర కిలో వందకు చేరింది. కూరల్లో వాడే అల్లం వెల్లుల్లి కిలో రేటు 200పై మాటే. ఆకుకూరల నుంచి కూరగాయల వరకు ధరలు భారీగా పెరిగాయి. అటు చికెన్‌ రేటు సైతం ఆకాశన్నంటింది. అలాగే కందిపప్పు రేటు ఎక్కువగానే ఉంది. మార్కెట్‌కు వెళ్లి ఏది తెచ్చి వండుకుందామన్నా అధిక ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పోయిన వానాకాలంలో సరిగా వర్షాలు కురవక పోవడం, యాసంగిలో ఎండదెబ్బ, నీటి కొరతతో సాగు విస్తీర్ణం తగ్గి ఉత్పత్తి పడిపోయింది. ఈ కారణాలతో డిమాండ్‌కు సరిపడా సప్లయ్‌ లేకపోవడంతో కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి.
పెరిగిన పప్పు, బియ్యం, నూనె ధరలు
ఒక వైవు కూరగాయలు కొనలేక సామాన్యులు అల్లాడీ పోతుంటే మరో వైపు పప్పు నుంచి ఉప్పు వరకు, కరివేపాకు నుంచి కాకరకాయ వరకు చికెన్‌ నుంచి అల్లంవెల్లుల్లి వరకు ఏది చూసినా అధిక ధరలు విపరీతంగా పెరిగాయి. పది రోజులుగా పెరుగుతున్న ధరలతో జనం బెంబేలెత్తుతున్నారు. కరువు, వేసవి దెబ్బ దిగుబడిలేక పెరిగిన ధరలతో అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. రూ.500 పెట్టినా రెండు రకాల కూరగాయలు, ఇద్దరు మనుషులకు మూన్నాలుగు రోజులు రావడం లేదు. ఇక కూరగాయల ధరలతో చికెన్‌ కూడా పోటీ పడుతోంది. కేజీ రూ.266కి పెరిగింది. అటు కూరగాయలు కొనలేక.. ఇటు చికెన్‌ తినలేక సామాన్యులు అల్లాడుతున్నారు. ఈ ధరలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పచ్చడం అన్నం తప్పేలా లేదంటున్నారు పేద, మధ్య తరగతి ప్రజలు.రైతు మార్కెట్లలో కిలో రూ.80 విక్రయిస్తున్నా పెద్దవూర మండలం లో వున్న 04
కూరగాయల షాపుల్లో మాత్రం రూ.100 నుంచి రూ.120 కు అమ్ముతున్నారు. రానున్న రోజుల్లో ధర ఎంత పెరుగుతుందోనన్న ప్రశ్న రేకెత్తుతోంది. టమాటనే కాక మిగతా కూరగాయల పరిస్థితీ ఇలానే ఉన్నాయి. పచ్చిమిర్చి కిలో రూ.100 ఉంటే.. బీన్స్‌ ఈ ధరను దాటేసింది. ప్రస్తుతం కిలో బీన్స్‌ 150కి విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో చిక్కుడు సప్లయ్‌ తగ్గింది. ప్రస్తుతం దీని ధర కిలో రూ.100 ఉంది. కూరల్లో రుచి కోసం ఉపయోగించే అల్లంవెల్లుల్లి ధర అకాశానికి నిచ్చన వేసింది. కిలో అల్లం వెల్లుల్లి రూ.200కు విక్రయిస్తున్నారు. మిగతా కూరగాయల ధరలను పరిశీలిస్తే కాకరకాయ, బెండ, బీరకాయ ధరలు కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌, కిలో 50కి అమ్ముతున్నారు. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ కిలో 40రూపాయలకు విక్రయిస్తుండగా కొత్తిమీర కట్ట 40 రూపాయలు, ఒక నిమ్మకాయ 10రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే బియ్యం, కంది పప్పు ధర భగ్గుమంటుంది. నెల క్రితం 160 రూపాయాలు ఉన్న కందిపప్పు రూ.190కి చేరింది. నూనె ధరలూ స్వల్పంగా పెరిగాయి. లీటర్‌ నూనెపై ఐదు రూపాయలు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో 25 కిలోల బియ్యం బస్తా 1,200కు విక్రయించగా ప్రస్తుతం 1,600కు అమ్ముతున్నారు. కూరగాయల ధరలు పెరగడానికి ఎండ దెబ్బ.. సకాలంలో వర్షాలు పడకపోవడం, దిగుబడి లేకపోవడం ఇలా అనేక కారణాలు కన్పిస్తున్నాయి. నెలాఖరు వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని.. రాబోయే రోజుల్లో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.
భగ్గుమంటున్న కూరగాయల ధరలు
కాశమ్మ గృహిణి (పెద్దవూర )
కూరగాయల ధరలు భగ్గుముంటున్నాయి. రూ.500లతో మార్కెట్‌కు వెళితో బ్యాగు నిండా కూడా కూరగాయలు రావడం లేదు. ముఖ్యంగా టమాట, పచ్చిమిచ్చి వంటి నిత్యం కూరల్లో వాడే వాటి ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయలైనా పావుకిలో రూ.40కి తక్కువకు దొరుకడం లేదు. పంట దిగుబడి రాకపోవడమే కూరగాయల పెరుగుదలకు కారణమని చెప్తున్నా పెరిగిన కూరగాల ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
టమాట, ఉల్లి, పచ్చిమిర్చి ధరలు తగ్గడం లేదు
రమావత్ సరిత గృహిణి (జయరాం తండా )
15 నుంచి టమాట ధర తగ్గడం లేదు. కిలో 30 రూపాయలు ఉన్న టమాట 100 రూపాయలకు చేరింది. అల్లం వెల్లుల్లి ధర కూడా పెరిగింది. పచ్చిమిచ్చి, చిక్కుడు, బీన్స్‌, నిమ్మకాయల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదు. అందుకే రేట్లు పెరుగుతున్నాయి.
ఈ సారీ బీర, కాకర సాగుచేశా..
– పాకాల ఎల్లయ్య రైతు బోనూతల -పెద్దవూర మండలం
ఈ సారి రెండుకారాలు బీర, రెండు ఎకరాలు కాకర సాగు చేశాను.బోరులో నీరు అంతంత మాత్రమే పందిరి విధానంతో బీర, కాకర వపంట పెట్టుబడిగా ఎకరానికి రూ.40వేల చొప్పున నాలుగు ఎకరాలకు రూ.1.60 లక్షలు పెట్టుబడి అవుతుంది.ఇప్పడే తీగ సాగింది సడ్సిడీపై డ్రిప్పు, విత్తనాలు ఇవ్వాలి.
రైతులను ప్రోత్సహించాలి. సబ్సిడీలు అందిస్తేనే రైతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారు. అంతటా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకోవడంతో రైతులు భూములు అమ్ముకొని వచ్చిన డబ్బులతో జీవిస్తున్నారు. దీంతో పంటల సాగు భారీగా తగ్గుతోంది. ఉత్పత్తి భారీగా పడిపోతూ ధరలు పెరుగుతున్నాయి.

Spread the love