– డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి జగన్
– పెరిగిన కూరగాయల ధరలను వెంటనే తగ్గించాలి
– ధరలను నియంత్రించటంలో ప్రభుత్వం విఫలం
– డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి జగన్ అన్నారు. పెరిగిన కూరగాయల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో కూరగాయల దుకాణాల్లో బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు కూరగాయల ధరలు ఆకాశానంటుతుండటంతో సామాన్యులు విలవిల్లాడు తున్నారన్నారు. గ్యాస్, వంటనూనె, పప్పులు, అల్లం వెల్లుల్లి, ఇతర నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు మండిపోతుండటంతో సామాన్యుడు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందన్నారు. పెరిగిన ధరలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని చెప్పారు. నిత్యం ఇంట్లో వాడుకునే టమాటా, పచ్చిమిర్చి రేట్లు దడ పుట్టిస్తున్నాయన్నారు. పెరిగిన ధరలతో ఏది కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడి పని చేసిన డబ్బంతా కూరగాయలకే సరిపోవటం లేదని, ఇంకా కుటుంబ పోషణ ఎలా సాధ్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్ద తక్కువ ధరకు కూరగాయలు కొనుగోలు చేసి దళారులు ధరలను పెంచి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. దళారులు మాత్రం లాభాలు గడిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కూడా తమిళనాడు తరహాలో రేషన్ షాపుల్లో తక్కువ ధరకు కూరగాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చెనమోని రాఘవేందర్, జిల్లా కమిటీ సభ్యులు దేవరకొండ రమేష్, నాయకులు ఆదర్ల సాయి, బోడ యాదగిరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.