నవతెలంగాణ ఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో పసిడి పతకం సాధిస్తుందన్న ఆశల వేళ ఈ వార్త కోట్లాది మంది భారతీయుల గుండెలను ముక్కలు చేసింది. ఈ క్రమంలోనే అనర్హతపై ప్రధాని మోడీ స్పందిస్తూ ‘‘వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్! నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నాం’’ అని మోడీ ఓదార్చారు.