నవతెలంగాణ – న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 12-13 తేదీలలో ప్రధాని అమెరికాలో పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 12న ప్రధాని అమెరికా వెళ్లనున్నారని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారని తెలిపింది. ప్రధాని పర్యటన భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. అమెరికా పర్యటనకు ముందు, ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 10-12 వరకు ఫ్రాన్స్‌లో నిర్వహించే ఎఐ యాక్షన్ సమ్మిట్‌కు ఆదేశ అధ్యక్షుడు మాక్రాన్‌తో పాటు సహ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. దక్షిణ ఫ్రాన్స్‌లోని కాడరాచెలో నిర్వహిస్తున్న అతిపెద్ద ప్రయోగం ‘ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ఐటిఇఆర్)’ను సందర్శించనున్నారు. ఈ ప్రయోగంలో భారత్ భాగస్వామిగా ఉంది.