నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో ఉంటే అది సమాజానికి అంత హాని తలపెడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజస్ధాన్‌లోని కోటాలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ర్యాలీకి పూర్తి భద్రత కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ బాధ్యులని తాము జైలుకు పంపుతామని, ఇది మోడీ గ్యారంటీ అని చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యార్ధులు శిక్షణ కోసం కోటాకు వస్తారని, విద్యార్ధులు, యువత కలలను కాంగ్రెస్ చిదిమేసిందని దుయ్యబట్టారు. రాజస్ధాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు. అశోక్ గెహ్లాట్ మాయాజాలం రాజస్ధాన్ ప్రజల శక్తి ముందు పనిచేయదని స్పష్టం చేశారు. డిసెంబర్ 3న రాజస్ధాన్ నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని ప్రధాని పేర్కొన్నారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. రాజస్ధాన్ యువత కాంగ్రెస్ నుంచి స్వేచ్ఛ కావాలని కోరుతున్నారన్నారు.