మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటారు: ప్రధానమంత్రి మోడీ

నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. చంద్రయాన్‌-3(chandrayaan-3) వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. తిరుచ్చిరాపల్లిలోని భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ ‘‘యువత ధైర్యవంతమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే నినాదంతో భారతీదాసన్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రస్తుతం దేశ యువత అదే పనిలో నిమగ్నమై ఉంది. యువత అంటేనే శక్తికి నిదర్శనం. నైపుణ్యంతో వేగంగా పనిచేయడం వారికున్న సామర్థ్యం. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు యువతకు ఇది మంచి సమయం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా.. నైపుణ్యాలను పెంచుకుంటూ.. కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి’’ అని యువతకు మోడీ పిలుపునిచ్చారు.
2014లో భారత్‌ నాలుగు వేల ఆవిష్కరణలకు పేటెంట్లు పొందితే.. ప్రస్తుతం ఆ సంఖ్య 50 వేలకు చేరిందని ప్రధాని తెలిపారు. చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో భారత శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని, మునుపెన్నడూ లేని విధంగా శాస్త్రవేత్తలు భారత ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నారని ప్రశంసించారు. భారతీయ కళాకారులు, సంగీతకారులు ఎన్నో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారని తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ తిరుచ్చిరాపల్లిలో రూ.20,140 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గత పదేళ్లలో విమానాశ్రయాలు, జాతీయ రహదారుల సంఖ్యను రెండింతలు చేసినట్లు మోడీ తెలిపారు.

Spread the love