– దేశంలో అతి అతిపొడవైన కేబుల్ బ్రిడ్జి
ద్వారక: దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. గుజరాత్‌లోని ద్వారకలో ఈ వంతెనను నిర్మించారు. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి ‘సుదర్శన్ సేతు’ అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారక తో అనుసంధానిస్తుంది. ఈ వంతెన నిర్మాణానికి 2017 అక్టోబర్‌లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పుతో, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్‌కు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్‌లు కూడా ఉన్నాయి. సుదర్శన్ సేతును ఒక ప్రత్యేకమైన డిజైన్‌తో నిర్మించారు. బ్రిడ్జ్ ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. అంతేగాక నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను సందర్శించారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు మత రాజకీయం కోసమే మోడీ ఈ ఫీట్లు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.