హైదరాబాద్ కు ప్రధాని మోడీ..నగరంలో హై అలెర్ట్

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 7.50కు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. కాగా.. ఈరోజు రాత్రికి ప్రధాని మోడీ రాజ్ భవన్ లో బస చేయనున్నారు. అనంతరం.. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. మొన్న బెంగళూర్ పేలుళ్ల ఘటన దృష్ట్యా హైదరాబాద్ మోడీ పర్యటనలో నిఘా పటిష్టం చేశారు పోలీసులు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ జంక్షన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, యశోద హాస్పిటల్ మార్గంలో దారి మల్లింపు చర్యలు చేపట్టారు. ఈరోజు రాత్రి 7:40 నుండి రేపు ఉదయం 10:15 వరకు ట్రాఫిక్ డివెర్షన్ ఉండనుంది. కాగా.. అటుగా వెళ్లే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ డైవెర్షన్స్ తో పాటు ప్రధాని వెళ్లే పలు రూట్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Spread the love