‘లోకమాన్య తిలక్‌’ అవార్డు స్వీకరించిన ప్రధాని, పవార్‌

పుణె : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘లోక్‌మాన్య తిలక్‌ జాతీయ పురస్కారం’ అందుకున్నారు. ‘ది తిలక్‌ స్మారక్‌ మందిర్‌ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. ఇవి తనకు గుర్తుండిపోయే క్షణాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రధాని మోడీని ఆప్యాయంగా పలకరిం చారు. విపక్షాల కూటమి మూడో విడత సమావేశం త్వరలో మహారాష్ట్రలో జరగనున్న నేపథ్యంలో ఆ కూటమి నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. ప్రధాని మోడీతో పవార్‌ వేదికను పంచుకోవడం గమనార్హం. విపక్షాలన్నీ ఏకమై బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలోనే ప్రధాని మోడీతో పవార్‌ వేదిక పంచుకోవడం మంచి పరిణామం కాదని ‘ఇండియా’ కూటమి సభ్యులు పేర్కొన్నారు. ఆ కార్యక్రమానికి వెళ్లొద్దని చెప్పడానికి ప్రయత్నించిన కొందరు ఎంపీలనూ పవార్‌ కలవకపోవడం గమనార్హం. మణిపుర్‌ సమస్య సహా అనేక విషయాల్లో పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో తాజా పరిణామం కీలకంగా మారింది. బిజెపి పట్ల అత్యంత కఠినంగా ఉండాల్సిన శరద్‌ పవార్‌.. ఏకంగా మోడీ పాల్గొన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లడం, ఆయనతో సన్నిహితంగా మెలగడం విపక్షాలకు మింగుడుపడటం లేదు. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌ పవార్‌ వర్గం) సభ్యులు.. మోడీ సందర్శించిన దగడూసేఠ్‌ గణేష్‌ ఆలయానికి కొంత దూరంలో నిరసన వ్యక్తం చేశారు. లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డును 1983లో ఏర్పాటు చేయగా.. ఏటా ఆగస్టు 1న దీన్ని ప్రదానం చేస్తున్నారు. మోడీ నాయకత్వ పటిమకు, పౌరుల్లో దేశభక్తిని పెంపొందించినందుకు గానూ మోడీకి ఈ ఏడాది పురస్కారాన్ని ఇచ్చినట్లు ట్రస్ట్‌ నిర్వాహకులు వెల్లడించారు.

Spread the love