ప్రధాని మణిపుర్ పై మాట్లాడింది కేవలం 2 నిమిషాలే : రాహుల్ గాంధీ

నవతెలంగాణ ఢిల్లీ: అవిశ్వాస తీర్మానం పై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రధానమంత్రి మాట్లాడిన తీరును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఓవైపు మణిపుర్‌ నిత్యం అల్లర్లతో మండుతుంటే.. ప్రధాని మాత్రం పార్లమెంట్‌లో నవ్వుతూ, జోకులు వేశారని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన తీరు తీవ్ర విచారకరమన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని వాక్యాలను రికార్డుల నుంచి తొలగించడంపై రాహుల్‌ స్పందించారు. ‘భరతమాత’ అనే పదాలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించడం అవమానకరమని ఆక్షేపించారు. ‘‘నేనేం ఆధారాల్లేకుండా అలా మాట్లాడలేదు. మణిపుర్‌లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య చర్చలే లేవు. కేవలం హింస మాత్రమే చెలరేగుతుంది’’ అని రాహుల్‌ తెలిపారు. తమ డిమాండ్‌ ఒక్కటేనని, ప్రధాని మోడీ కనీసం ఒక్కసారైనా మణిపుర్‌కు వెళ్లి ఇరు వర్గాలతో మాట్లాడాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
‘‘ప్రధాని అవిశ్వాసంపై లోక్‌సభలో 2 గంటల 13 నిమిషాల పాటు చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన మణిపుర్‌ గురించి  మాట్లాడింది కేవలం 2 నిమిషాలే. గత కొన్ని నెలలుగా మణిపుర్‌లో ఏం జరుగుతోందో ప్రధాని మర్చిపోయినట్లున్నారు. ఓవైపు అల్లర్లు, లైంగికదాడులు, హత్యలతో మణిపుర్‌ అట్టుడుకుతోంటే.. ప్రధాని పార్లమెంట్‌లో నవ్వుతూ, జోకులు వేశారు. విపక్షాలను విమర్శిస్తూ నినాదాలు చేశారు. గతంలో ఎందరో ప్రధానులను చూశాను. కానీ, ఇలా స్థాయి దిగజారి మాట్లాడిన ప్రధానిని మాత్రం నేను చూడలేదు. ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి.. దేశ ప్రజలందరికీ ప్రతినిధిగా ఉంటారు. ఆయన ఓ రాజకీయ నాయకుడిగా మాట్లాడకూడదు’’ అని రాహుల్‌ మండిపడ్డారు.
‘‘ఇక్కడ సమస్య కాంగ్రెస్సో, నేనో కాదు. 2024లో మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారా? లేదా? అన్నది కూడా కాదు. మణిపుర్‌లో ఏం జరుగుతోంది? దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం? అనేదే ప్రధాన సమస్య. దీన్ని పరిష్కరించేందుకు ప్రధాని చేతుల్లో చాలా అవకాశాలున్నాయి. కానీ, వాటిని ఆయన వినియోగించట్లేదు. ఆర్మీని రంగంలోకి దింపితే రెండు, మూడు రోజుల్లో శాంతిని నెలకొల్పేందుకు అవకాశం ఉంటుంది. కానీ ప్రధాని ఆ నిర్ణయం తీసుకోవట్లేదు. మణిపుర్‌ మండుతూనే ఉండాలని, దాన్ని ఆర్పకూడదని ఆయన భావిస్తున్నారు’’ అని రాహుల్‌ ధ్వజమెత్తారు.

Spread the love