రిజర్వేషన్లపై ప్రధాని స్పష్టతనివ్వాలి

Prime Minister should clarify on reservations– కులగణనకు ఎందుకు ఒప్పుకోవడం లేదు : బీజేపీకి 16 బీసీ సంఘాల ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై స్పష్టమైన విధానం ప్రధానమంత్రితో ప్రకటన చేయించాలని బీజేపీని 16 బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. దేశంలోని బీసీలకు బీజేపీపై అనేక అనుమానాలున్నాయని తెలిపాయి. ఈ ఎన్నికల సందర్భంగా అన్ని రంగాలలో బీసీలకు జనాభా ప్రకారం వాటా ఇస్తామంటూ మోడీ ప్రకటించాలని కోరాయి. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు నీల వెంకటేశ్‌, విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ, రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అనంతయ్య, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు రాజేందర్‌, ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కృష్ణయాదవ్‌, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, రాష్ట్ర బీసీ ఫ్రంట్‌ చైర్మెన్‌ గోరిగె మల్లేష్‌ యాదవ్‌, రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు కూనేరు నర్సింహాగౌడ్‌, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లపల్లి అంజి, రాష్ట్ర బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణ, రాష్ట్ర బీసీ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ముత్యం వెంకన్నగౌడ్‌, రాష్ట్ర బీసీ ప్రజాసమితి అధ్యక్షులు మధుసూదన్‌, రాష్ట్ర బీసీ జనసమితి అధ్యక్షులు వెంకన్న, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు టిఆర్‌ చంద్ర సంయుక్తంగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
– గత పదేండ్లుగా బీజేపీ తిరుగులేని మెజార్టీతో ఈ దేశాన్ని పాలిస్తున్నది. కానీ ఈ పదేండ్ల కాలంలో బీసీల అభివృద్ధికి, బీసీలకు చిన్న పథకం మేలు చేయడం లేదు.
– కులాల వారి లెక్కలు తీయమంటే బీజేపీ ఒప్పుకోవడం లేదు. అన్నీ పార్టీలూ కోరుతున్నా కానీ ఎందుకు చేయడంలేదు
– ఈ పదేండ్ల కాలంలో బీసీల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లు 50 శాతానికి పెంచడం లేదు.
– చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టడం లేదు. బీసీ బిల్లు పార్లమెంటులో పెడితే బీజేపీ వ్యతిరేకించింది. అన్ని పార్టీల మద్దతు ఇస్తే బీజేపీ ఎందుకు వ్యతిరేకించింది.
– కేంద్ర బడ్జెట్లో బీసీలకు విద్యా, ఆర్థిక, అభివృద్ధి కోసం రూ.రెండు లక్షల బడ్జెట్‌, కేటాయించి బీసీ విద్యార్థులు చదువుకోవడానికి ఆర్థికంగా ఆదుకోవడానికి స్కాలర్‌షిప్‌ స్కీం, ఫీజురీయింబర్స్‌ మెంట్‌ స్కీం హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు పెట్టాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఉద్యమాలు చేసిన పట్టించుకోలేదు.
– కేంద్ర స్థాయిలో జాతీయ బీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు ఎందుకివ్వడం లేదు.
– కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదు. భర్తీ చేస్తే బీసీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని భర్తీ చేయడం లేదా?.
– కేంద్రంలో 100 ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పోస్టులు ఉంటే కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు.
– ఒకవైపు 1674 ఐఏఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదు. భర్తీ చేస్తే బీసీలు ఎక్కువ అవుతారని భయమా?
– ఇక బీసీలలో ఒక్కరైనా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ కంపెనీ దిగ్గజాలు ఉన్నారా?
– ఒక 100 మంది కార్పొరేట్‌ దిగ్గజాలు ఉంటే వారికి రూ.16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారు. ఇందులో ఒక్కరైనా బీసీలు ఉన్నారా?
– అగ్ర కులాల వారిలో మూడు శాతం పేదవారు ఉంటే 10 శాతం రిజర్వేషన్లు పెట్టారు. అగ్ర కులాల వారు ఏనాడు తమకు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. ఉద్యమాలు చేయలేదు. ఎందుకు పెట్టారు. ఇది అగ్రకులాల పక్షపాత ధోరణి అని స్పష్టంగా కనిపిస్తుంది.
-1990లో మండల్‌ కమిషన్‌ ఉద్యమంలో అన్ని పార్టీలు మండల్‌ అనుకూల ఉద్యమంలో పాల్గొన్నాయి. బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఎవరి పక్షాన నిలబడ్డారో దేశానికి తెలుసు. ఈ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి.
ఇలా బీసీ వ్యతిరేక చర్యలు అనేకం ఉన్నాయని బీసీ సంఘాలు నాయకులు విమర్శించారు. కనీసం ఇప్పుడైనా బీసీల అనుకూల వైఖరికి మారాలని కోరారు. పైగా బీసీల అభివృద్ధి గురించి ఏ పార్టీ మాట్లాడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీసీల పక్షాన మాట్లాడుతున్నారని తెలిపారు. జనగణనలో కులగణన చేసి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 25 నుంచి 50 శాతం శాతానికి పెంచుతామని ప్రకటించారని పేర్కొన్నారు. అలాగే చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారని తెలిపారు.

Spread the love