టికెట్ల ముద్రణ ఇక ఔట్‌సోర్సింగ్‌ !

–  ప్రింటింగ్‌ ప్రెస్సులు మూసివేయనున్న రైల్వే
–  వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు
న్యూఢిల్లీ : 2019లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దేశంలోని ఐదు టికెట్‌ ప్రింటింగ్‌ ప్రెస్సులను మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇకపై టికెట్ల ముద్రణ బాధ్యతను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఆల్‌ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌ఎఫ్‌), సదరన్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌ఆర్‌ఎంయు), ఇతర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కార్మిక సంఘాల వ్యతిరేకత దృష్ట్యా గతంలో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నప్పటికీ ఇప్పుడు మళ్లీ ముందుకు వెళుతోంది. చెన్నైలోని రోయపురం, సికింద్రాబాద్‌, ముంబయిలోని బైకుల్లా, పశ్చిమబెంగాల్‌ లోని హౌరా, ఢిల్లీలోని షాకూర్‌బస్తీ ప్రింటింగ్‌ ప్రెస్సులను మూసివేస్తారు. ఈ మేరకు అన్ని జోనల్‌ కార్యాలయాలకు సమాచారం ఇచ్చారు. ప్రెస్సులలోని సిబ్బందిని ఇతర విభాగాలలో సర్దుబాటు చేస్తారు. యంత్రాలు, ప్లాంట్లను సంబంధిత జోనల్‌ కార్యాలయాలు విక్రయిస్తాయి. ప్రింటింగ్‌ ప్రెస్సులు ఉన్న స్థలాలను ‘ప్రయోజనం కలిగే రీతిలో వినియోగిస్తా’మని చెబుతున్నారు. అయితే చరాస్తులను వాణిజ్య అవసరాల కోసం అభివృద్ధి చేస్తారా లేక బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తారా అనేది తెలియరాలేదు. ప్రింటింగ్‌ ప్రెస్సులను మూసివేయడంతో టికెట్ల మద్రణను రిజర్వ్‌బ్యాంక్‌ లేదా భారతీయ బ్యాంకుల సంఘం అనుమతితో సెక్యూరిటీ ప్రింటర్లకు ఔట్‌సోర్సింగ్‌ ఇస్తామని రైల్వే శాఖ తెలిపింది. కార్మికులందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని రైల్వేలో అతిపెద్ద కార్మిక సంఘం ఎఐఆర్‌ఎఫ్‌ అధ్యక్షుడు కె.కన్నయ్య చెప్పారు. రైల్వేల రోజువారీ పనులకు దశాబ్దాల తరబడి ఈ ప్రెస్సులు సేవలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. టికెట్ల ముద్రణ వంటి పనులను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వకూడదని అన్నారు. ఇప్పటికే ప్రింటింగ్‌ ప్రెస్సులలో సిబ్బందిని కుదించారని, పదవీవిరమణ చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించలేదని తెలిపారు.

Spread the love