– కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
– మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే, పోలవరం, అమరావతి అంశాలపై చర్చించారు. ఇటీవలి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో వికసిత ఆంధ్రప్రదేశ్ – 2047 కలని సాకారం చేసేలా, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు (ముఖ్యంగా పోలవరం – అమరావతి) నిధులు కేటాయించాలని కోరారు. అలాగే మరిన్ని నూతన ప్రాజెక్టులను కేటాయించి, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూలోటు పూడ్చడం, అలాగే విభజన హామీలు అమలకు నిధులు కేటాయించడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే రాష్ట్ర అప్పులు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి గురించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు జీఎస్టీ సెస్ 1 శాతం విధింపు వంటి అంశంపై చర్చించారు. నదుల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నదుల అనుసంధానానికి కొన్ని కీలకమైన ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచింది. వీటిపై మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు లేవనెత్తారు. అలాగే విభజన హామీల్లో ప్రధానంగా వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వెనుకబడిన జిల్లాల నిధులు అంశం కూడా గత కొంతకాలంగా పెండింగ్‌లోనే ఉంది. ఈ అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తదితరులు ఉన్నారు.