ప్రయివేటు,కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా విద్యాబోధన…

– రీజనల్ కో ఆర్డినేటర్ షకీన
– నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు

– ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి
– నాగార్జునసాగర్ లో ఎంజేపీటీ 36వ వార్షికోత్సవ వేడుకలు
నవతెలంగాణ నాగార్జునసాగర్ :
ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వం సర్కారు బడులు, గురుకులాల్లో విద్యాబోధన అందిస్తున్నదని అన్నారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల(ఎంజేపీటీ) 36వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గురుకుల కళాశాల ప్రధానోపాధ్యాయులు రజనీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంజేపీటీ నల్గొండ జిల్లా ఆర్.సి.ఓ ఎం.షకీన హాజరై ఉపాధ్యాయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కళాప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం నల్గొండ జిల్లా ఆర్.సి.ఓ షకీన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ లోని అన్ని గురుకులాల కంటే కూడా నాగార్జునసాగర్ గురుకుల పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉందని విశాలమైన వాతావరణంలో పాఠశాల నెలకొల్పబడిందని విద్యార్థులు నాగార్జునసాగర్ గురుకులంలోనే ఆసక్తి చూపిస్తుంటారని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో విద్యనభ్యసిస్తేనే అనుకున్నది సాధిస్తారని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజనీకాంత్ మాట్లాడుతూ 1987 సంవత్సరంలో పాఠశాల నెలకొల్పబడిందని అప్పటినుండి అనేక మంది పూర్వవిద్యార్థులు చదువుకొని ఉన్నత పదవులలో ఉన్నారని అన్నారు. నందికొండ కౌన్సిలర్ మంగత నాయక్ మాట్లాడుతూ.. పూర్వం మేము చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉంటూ చాలా చాలని అన్నంతో ఎంతో కష్టపడి చదువుకుని ఈస్థాయిలో ఉన్నామని అలాగే మీరు కూడా ఎలాంటి వ్యసనాలకు బానిస కాకుండా కష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరాలని చదువుకున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి అన్నారు. ఈకార్యక్రమంలో నాట్కో ఫార్మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చంద్ర శేఖర్ పాటిల్, నాట్కో ఏజీఎం రంజిత్ కుమార్, ఎం.జె.పి.టి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ రవీంద్ర చారి, కెనరాబ్యాంక్ మేనేజర్ శ్రీధర్ మరియు ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు ,విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.

Spread the love