– నవతెలంగాణ ఇంటర్వ్యూలో జిల్లా వైద్యాధికారి వసంతరావు
నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోని అధిక డబ్బులు వసూలు చేస్తే తమకు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటాం. జ్వరాల బారిన పడితే భయపడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలి. ప్రస్తుతం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటికి జ్వర సర్వేను వైద్య సిబ్బంది చేస్తున్నారు. డెంగ్యూ జ్వరాలపై కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు వదంతులు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలు భయాందోళన చెందవద్దు. సీజనల్ వ్యాధులు జ్వరాలు ప్రభలుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా వైద్య శాఖ 24 గంటలు ప్రజలను కాపాడటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే అన్ని పి హెచ్ సి లోని సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. ప్రైవేట్ కు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు. జిల్లా, జనరల్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ప్లేట్లెట్స్ తగ్గడం లాంటి వైద్య సేవలు అందిస్తున్నాం. జిల్లాలో ఎనిమియా ముక్తి తెలంగాణ అనే కార్యక్రమం జరుగుతుంది. అనారోగ్యాల బారిన పడిన వారికి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు వైద్య సిబ్బంది కౌన్సిలింగ్ చేస్తున్నారని నవ తెలంగాణ ఇంటర్వ్యూలో జిల్లా వైద్యాధికారి వసంతరావు వెల్లడించారు.
నవతెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లోని రోగులనుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.
జిల్లా వైద్యాధికారి: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు రోగుల నుంచి ఎవరైనా వసూలు చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే మా దృష్టికి తీసుకురావాలి. జిల్లా రెగ్యులరిటి అథారిటీ చట్టం ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రుల్లో తప్పనిసరి రోగాలకు సంబంధించిన చార్జీల బోర్డును ఏర్పాటు చేయాలి.
నవతెలంగాణ: జిల్లాలో జ్వరాలు అధికంగా వస్తున్నాయి అంతేకాకుండా డెంగ్యూ వ్యాధి తీవ్రత పెరిగింది దీనిపై మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా వైద్యాధికారి: జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రతి వైద్య ఆరోగ్య సెంటర్లో మందులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటున్నారు. డెంగ్యూ జ్వరం అయితే ప్లేట్లెట్స్ తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఆస్పత్రికి వస్తే వెంటనే పరీక్షలు జరిపి కావాల్సిన మందులు వైద్య సిబ్బంది అందిస్తారు.
నవతెలంగాణ: ఎనీమియా ముక్తి తెలంగాణ అనే కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారు.
జిల్లా వైద్యాధికారి: ఎనీమియా ముక్తి తెలంగాణ అనే కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా సాగుతుంది. ఇప్పటికే అంగన్వాడి సెంటర్లలో, సబ్ సెంటర్లలో అన్ని వయసుల వారికి పరీక్షలు చేసి అన్ని రకాల మందులు ఇస్తున్నాం. అలాగే వారికి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ప్రతిరోజు 120 క్యాంపులు చేస్తున్నాం. అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉన్నారు. అలాగే ఇంటింటి సర్వేలో రక్తహీనత ఎక్కువ మందికి కనిపిస్తుంది. నెల రోజుల్లో 1080 శాంపిలు సేకరించడం జరిగింది. జిల్లాలోని 61 సబ్ సెంటర్లలో 15 పీహెచ్సీల్లో 87 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది.
నవతెలంగాణ: ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అధిక డబ్బులు వసూలు చేసుకుని ఆడ మగ చెబుతున్నారు. అధికారుల దృష్టికి వచ్చిన చర్యలు తీసుకోవడం లేదు.
జిల్లా వైద్యాధికారి: ప్రైవేటు ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఆడ మగ అనేది చెప్పవద్దని, అలా చెప్పినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అనేకసార్లు హెచ్చరించారు. అలాంటిది మీ దృష్టికి వచ్చినట్టయితే మాకు సమాచారం అందించండి. సంబంధిత ల్యాబ్ పై విచారణ జరిపి సీజ్ చేస్తాం. అధికంగా డబ్బులు అడిగిన మా దృష్టికి తీసుకువస్తే వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుంది.