దోపిడికి అడ్డాగా ప్రయివేట్‌ స్కూళ్లు..!

– పాఠశాలలను దుకాణాలుగా మార్చేసిన వైనం
– పుస్తకాల నుంచి షూస్‌ దాకా విక్రయం!
– మార్కెట్‌ కంటే రెండింతలు ధరలతో కోట్లలో దోపిడీ
– అడ్డగోలు ధరలకు బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు
– ఇంత జరుగుతున్న.. దిక్కులు చూస్తున్న విద్యాశాఖ
నవతెలంగాణ-సిటీబ్యూరో
బడులు షురువయ్యాయి. విద్యార్థులు ఇప్పుడిప్పుడే బడిబాట పడుతుండగా.. మరోవైపు ప్రయివేట్‌ విద్యాసంస్థల దోపిడీ పర్వం మొదలైంది. రకరకాల పేర్లతో పుట్టగొడులుగా పుట్టుకొస్తున్న ప్రయివేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు ధనార్జనే లక్ష్యంగా ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్‌ మొదలుకొని పిల్లలకు అందించే టై, బెల్టు, బూట్లు, దుస్తులు, వరకు ఆయా యాజమాన్యాలు నిర్ణయించిన ధర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇంత బహిరంగంగా విద్యార్థుల తల్లిదండ్రులను దోపీడీ చేస్తున్నా.. ఈ విషయం తెలిసినా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సర్కారు బడుల్లోనే తమ పిల్లలను చదివించాలంటూ ఎంతో ఉత్సహాంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
జిల్లాలో ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు నిలువు దోపిడీ షురూ చేశాయి. పుస్తకాలు, యూనిఫాంలు, బెల్ట్‌, టై, సాక్స్‌, షూస్‌ తదితర ధరలతో పాటు ఫీజులను 20 నుంచి 30శాతం వరకు పెంచి అందినకాడికి దండుకుంటున్నాయి. బయట మార్కెట్‌లో కొనుగోలు చేస్తామంటే వీల్లేదని నిబంధనలు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదులుతున్న ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లు పడుతుండగా.. ప్రయివేట్‌, కార్పొరేట్‌ యాజమాన్యాలు పండుగ చేసుకుంటున్నాయి.
మార్కెట్‌లో కంటే రెండింతల ధరలకు..
నగరంలో 1896 ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో 6.86 లక్షల మంది చదువుతున్నారు. 691 ప్రభుత్వ పాఠశాలల్లో 1,14,607 మంది, ఎయిడెట్‌ పాఠశాలల్లో 50వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు ఉచితంగా సరఫరా చేస్తుండగా.. ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు మాత్రం వారికి ఇష్టమైన ధరలకు అమ్ముకుంటున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు, బూట్లు, దుస్తులు, టైలు, బ్యాడ్జీలు, గుర్తింపు కార్డులు, బ్యాగులు, పెన్నులు, కవర్లు, పెన్నిళ్లు ఇలా అన్ని రకాల వస్తు సామాగ్రికి రూ. 6వేల నుంచి 10వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కొ పాఠశాలకు ధరల్లో వేలల్లో వ్యత్యాసం ఉంటుంది. అంతేగాక ఈ పాఠశాలల్లో విక్రయించే పాఠ్యపుస్తకాలు మార్కెట్‌లో ఎక్కడా దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. తమ వద్ద అన్ని కొనుగోలు చేస్తేనే పాఠ్యపుస్తకాలు ఇస్తామని మెలిక పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
తనిఖీలేవి..?
ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. యథేచ్చగా దోపిడీ చేస్తున్నా.. జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ దోపిడీపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేస్తే.. తూతుమంత్రంగా ఆ పాఠశాలను తనిఖీ చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. నిజానికి ప్రయివేట్‌ స్కూళ్ల యాజమాన్యాల బహిరంగ దోపిడీ గురించి అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి అక్రమంగా పుస్తకాలు, యూనిఫామ్స్‌ తదితర వస్తువులు అమ్ముకుంటూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రయివేట్‌ కార్పొరేట్‌ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
హైదరాబాద్‌ జిల్లాలోని ప్రయివేట్‌ కార్పొరేట్‌ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ముషీరాబాద్‌లోని కార్పొరేట్‌ శ్రీచైతన్య స్కూల్‌ గుర్తింపు లేకుండా నడుస్తుండటంతో పాటు బుక్స్‌, యూనిఫాంల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నదని గురువారం ఆ స్కూల్‌ ఎదుట నగర ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో పుస్తకాలు, యూనిఫాంలు కిరాణా దుకాణాల్లో అమ్మినట్టుగా విక్రయిస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించు కోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రయివేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఒకే గుర్తింపుతో అనేక శాఖలు నిర్వహిస్తూ.. అడ్మిషన్లు తీసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న ప్రయివేట్‌ స్కూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు లెనిన్‌ చేగువేరా, అంబర్‌పేట్‌ సెక్రెటరీ నాగేందర్‌, స్టాలిన్‌ ఏసుదాసు, శివ తదితరులు పాల్గొన్నారు.

Spread the love