ప్రయివేట్‌ ట్రావెల్స్‌ నిలువుదోపిడీ

Private Travels is a vertical exploitation– పండుగ వేళ సొంతూర్లకు వెళ్లేవారి నడ్డివిరుస్తున్న వైనం
– ఇష్టానుసారం ధరలు పెంచి వసూళ్లు
– నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆపరేటర్ల పై ఆర్టీఏ ఫోకస్‌
– ఐదు బస్సులపై కేసులు నమోదు.. రూ.పదివేల జరిమానా
– ఈనెల 16 వరకు కొనసాగనున్న ఆర్టీఏ దాడులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని ప్రయివేటు ట్రావెల్స్‌ సొమ్ము చేసుకుంటు న్నాయి. రెండు మూడింతలు చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాకు సొంతూర్లకు వెళ్లాలని ప్రజల కోరిక.. కానీ సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయివేటు దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పండుగకు నాలుగైదు రోజులకు ముందు నుంచే టికెట్ల ధరలను ఎడాపెడా పెంచేసి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి వాళ్లకు చెక్‌పెట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపింది. నగరంలోని వివిధ రూట్లతో పాటు ప్రధాన హైవేలో ఈ బృందాలతో ప్రత్యేక తనిఖీలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్‌ బస్సులపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌(జేటీసీ) సి.రమేష్‌ ఆదేశాల మేరకు ఆర్టీఏ అధికారులు రెండు రోజులుగా నగరంలోని వివిధ రూట్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేయాలనీ, అవసరమైతే సీజ్‌ చేయడం, కంపౌండింగ్‌ ఫీజు వసూలు చేయడం వంటి చర్యలు చేపట్టాలని జేటీసీ ఆదేశించారు.
కాగా దసరాకు హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలు, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు 900కుపైగా ప్రయివేటు బస్సులు నడుస్తుంటాయి. ఇందులో ప్రధానంగా పర్మిట్‌ ఉల్లంఘనలు, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోవడం, ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌, అగ్నిమాపక యంత్రాల్లేని బస్సులు, కమర్షియల్‌ గూడ్స్‌ మోసుకెళ్లే బస్సులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. వీటితోపాటు పండుగ సమయాల్లో అధిక టికెట్‌ చార్జీల వడ్డెన లేకుండా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేలా రవాణాశాఖ చర్యలు తీసుకుంటుంది.
ఐదు బస్సులు సీజ్‌.. రూ. 10వేల జరిమానా
రెండు రోజులుగా ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా దసరా సందర్భంగా ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేయడంపై దృష్టిసారిస్తున్నారు. అలాగే బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉందా? లేదా చెక్‌ చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్‌ గూడ్స్‌ క్యారీ చేస్తున్న ట్రావెల్స్‌పై పెనాల్టీలు వేస్తున్నారు. నగరంలోని ప్రధాన రూట్లతో పాటు జాతీయ రహదారులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేపడు తున్నారు. తిరుమలగిరి, మలక్‌పేట్‌, బండ్లగూడ, ఉప్పల్‌, మన్నేగూడ ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్స్‌, హౌంగార్డులతో కలిసి తనిఖీలు చేపట్టి దాదాపు ఐదు సీసీ బస్సులపై కేసులు నమోదు చేసి.. రూ.పదివేల కాంపౌండింగ్‌ ఫీజు వసూలు చేశారు. పండుగ వేళ టీఎస్‌ఆర్టీసీ వసూలు చేస్తున్నట్టుగానే చార్జీలు తీసుకోవాలని, వ్యాలిడ్‌ పర్మిట్లు, ఫిట్‌నెస్‌, పరిమితికి మించకుండా ప్రయాణికులను తీసుకువెళ్లాలని, ఫస్ట్‌ ఏయిడ్‌ బాక్స్‌, అగ్నిమాపక సిలిండర్‌ వంటివి ఏర్పాటు చేయకుండా బస్సులు తిప్పితే కఠిన చర్యలు తప్పవని జేటీసీ సి.రమేష్‌ ప్రయివేటు ట్రావెల్స్‌ నిర్వాహకులను హెచ్చరించారు. మరో వారం రోజుల పాటు ఈ దాడులు కొనసాగుతాయని జేటీసీ తెలిపారు.
అధిక చార్జీలతో ప్రయాణికుల బెంబేలు
దసరా వేళ ప్రయివేటు బస్సుల నిర్వాహకులు అధిక చార్జీలతో ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణ చార్జీలను ఇష్టారాజ్యం గా పెంచేశారు. ఆర్టీసీతో పోలిస్తే.. రెండు నుంచి మూడింతలు చార్జీలు వసూలు చేస్తూ దోపీడీకి పాల్పడుతున్నారు. ముఖ్యంగా పండుగ రోజుల్లో తెలంగాణ నుంచి ఏపీలోని విజయవాడ, అమరావతి, విశాఖపట్నం, తిరుపతితో పాటు బెంగళూరు మార్గాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. చార్జీల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడం ప్రయివేట్‌ ఆపరేటర్లకు కలిసివస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులు ఏసీతో రూ.500-600పైనే ఉండగా.. ప్రయివేటులో రూ.2వేలు ఏసీ, నాన్‌ ఏసీ 1600 వరకు ఉంది. విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు ప్రాంతాల్లో ఆర్టీసీల్లో 1150 లోపు ఉండగా.. ప్రయివేటులో రూ.3,400 నుంచి 4వేల వరకు ఉంది.

Spread the love