బొగ్గు బావుల ప్రయివేటీకరణ ఆపాలి

Coal wells Privatization must stop– సింగరేణికి కేటాయించాలి
– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌
– హైదరాబాద్‌ గోల్కొండ చౌరస్తా వద్ద ధర్నా
– బొగ్గు గనుల వేలంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌/విలేకరులు
బొగ్గు బావుల ప్రయివేటీకరణ ఆపి వాటిని సింగరేణికి కేటాయించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల వేలం, కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడంపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ముషీరాబాద్‌ గోల్కొండ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌ పథకాన్ని అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయాలని, కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టాలని ముందుకెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటు కార్పొరేటు శక్తులకు కట్టబెట్టడానికి పదో విడత బొగ్గు బావుల వేలం ప్రక్రియ మొదలు పెట్టారని, రాష్ట్రానికి చెందిన ఎంపీ కిషన్‌ రెడ్డి కేంద్ర గనుల శాఖ మంత్రి పదవి చేపట్టగానే తెలంగాణకు తీరని అన్యాయం చేయబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 60 గనులను వేలం వేసి బహిరంగంగా ప్రయివేటు కార్పొరేట్‌ వ్యక్తులకు కట్టబెడుతోందని, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం వేయకుండా నేరుగా సింగరేణికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కీలకమైన కోల్‌మైన్‌ రంగంలో ఈ వేలంపాట ప్రక్రియకు తలుపులు తీయడం మరో విధమైన ప్రయివేటీకరణకు దారి తీసినట్టు అని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు మైన్స్‌ ఇవ్వకపోవడం, ఆ రకంగా నష్టాల్లోకి నెట్టేయడం, ఆ తర్వాత ప్రయివేటుపరం చేయడం మరో రకమైన ప్రక్రియ అని వివరించారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో కార్మిక సంఘాలు కలిసి రావాలని, ప్రజలు ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు నేరుగా బొగ్గు బ్లాక్‌లను ఎలాగైతే అటాచ్‌ చేసిందో.. అదే విధంగా సింగరేణికి బొగ్గు బ్లాక్‌లను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా తలపెట్టిన వేలంలో పాల్గొనకుండా నేరుగా సింగరేణికి ఇప్పించ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిం చాలన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలంలో ఉంచడాన్ని అడ్డుకోవాల్సిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదారాబాద్‌ వేదికగానే వేలం నిర్ణయం తీసుకో వడం కుట్రలో భాగమన్నారు. ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, ఎస్‌.రమ, పి.జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్‌, రమేష్‌, నాయకులు ఎం.వెంకటేష్‌, జి.రాములు, మహేందర్‌, మల్లేష్‌, సత్యనారాయణ, మోహన్‌ పాల్గొన్నారు.
సూర్యాపేట, యాదాద్రిలో..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్‌ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ కాటేదాన్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోనే బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభించటం పట్ల కార్మిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్తగూడెంలో..
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ 60 బొగ్గు బ్లాక్‌లను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయం, కార్పొరేట్‌ ఏరియాలోని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల అడ్డాల వద్ద కార్మికులు నిరసన తెలిపారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి డి.వీరన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు మాట్లాడుతూ.. 60 బొగ్గు బ్లాకుల్లో రాష్ట్రంలోని సింగరేణి సంస్థకు చెందిన శ్రావణపల్లి మెగా ప్రాజెక్ట్‌ కూడా ఉందని చెప్పా రు. దీనిని అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాలని, ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం త్రీటౌన్‌ ఏరియాలో ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ చౌక్‌లో గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
గోదావరిఖని చౌరస్తాలో..
కేంద్ర ప్రభుత్వం బొగ్గు బావుల వేలాన్ని విరమించుకోవాలని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మెయిన్‌ చౌరస్తాలో ప్లకార్డ్స్‌ పట్టుకుని నిరసన తెలిపారు. గతంలో రామగుండం బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలోని బొగ్గు గనులను ప్రయివేటు వారికి అప్పగించబోమని చెప్పి.. ఇప్పుడు వేలం వేయడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.
భూపాలపల్లిలో..
సింగరేణి బొగ్గు బ్లాక్‌ల ప్రయివేటీకరణను నిలిపివేయాలని, వేలం వేయకుండా సింగరేణికి అప్పగించాలని సీఐటీయూ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్లో నిరసన చేపట్టారు.

Spread the love