న్యూఢిల్లీ : ప్రతిపాదిత బ్రాడ్‌కాస్టింగ్ సేవల నిబంధనల బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, వ్యక్తులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని, వారి నోటికి తాళం వేయాలని చూస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. 1995వ సంవత్సరం నాటి కేబుల్ టీవీ నెట్‌వర్కుల చట్టం స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చి దేశంలోని బ్రాడ్‌కాస్టింగ్ రంగాన్ని నియంత్రించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. మీడియా సంస్థలు, వ్యక్తులు, ప్రజల అభిప్రాయం కోరింది. ముసాయిదా బిల్లుపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమర వీరులు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు పౌర, పత్రికా స్వేచ్ఛలు లభించాయని ప్రియాంక తెలిపారు. పౌరులకు కల్పించిన స్వేచ్ఛను హరించాలని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించదని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేశారు. ‘ఇవాళ ఒకవైపు మీడియా మొత్తం ప్రభుత్వానికి బాకా ఊదుతోంది. మరోవైపు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఓటీటీ వేదికలు, వ్యక్తుల నోటికి తాళం వేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది’ అని మండిపడ్డారు. ప్రతిపాదిత బిల్లు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను దేశం అనుమతించదని ప్రియాంక తెలిపారు. కాగా బిల్లు ఇప్పటికీ ముసాయిదా దశలోనే ఉన్నదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ చెప్పారు. ప్రస్తుతం సంబంధీకులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు.