– డీహెచ్‌కు టీయుఎంహెచ్‌ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ- సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. సెప్టెంబర్ ఒకటి నుంచి సమ్మెలో ఉన్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి ఫసియొద్దీన్ నాయకత్వంలో ప్రతినిధులు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావుకు వినతిపత్రం అందదజేశారు.
ఎన్‌హెచ్‌ఎం పరిధిలోని యూపీహెచ్‌సీ, యూసీహెచ్సీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పారామెడికల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇది వరకే ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు వారు గుర్తుచేశారు. ఎన్‌హెచ్‌ఎం పరిధిలో 17 వేల మంది పని చేస్తుండగా వారిలో అత్యధికులకు పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు చెల్లించడం లేదని తెలిపారు. గతంలో జీవో నెంబర్ 510 ద్వారా దాదాపు 10 వేల మంది వరకు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఎంలు తదితరులకు బేసిక్ ప్రకారం వేతనాలు నిర్ణయించి చెల్లిస్తున్నారని తెలిపారు. ఇందులో కొన్ని క్యాటగిరీలకు పర్మినెంట్ ఉద్యోగుల బేసిక్ కన్నా తక్కువ చెల్లిస్తున్నారని తెలిపారు. మిగిలిన దాదాపు 7 వేల మందికి కనీస బేసిక్ కాకుండా అతితక్కువ వేతనాలు చెల్లిస్త్నునారనీ, వీరందరికీ కనీస వేతనం, డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు నిర్ణయించి అమలు చేయాలని కోరారు.
ప్రభుత్వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలు అమలు కాకుండా తక్కువ వేతనాలు పొందుతున్న క్యాడర్లలో అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న పారామెడికల్ సిబ్బంది, అకౌంటెంట్స్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పబ్లిక్ హెల్త్ మేనేజర్ (కమ్యూనిటీ ఆర్గనైజర్ల్లు), సపోర్టింగ్ స్టాఫ్‌లోని మెడికల్ అసిస్టెంట్లు, వాచ్‌మెన్, స్వీపర్లు, బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, సపోర్టింగ్ స్టాప్ తదితరులున్నారని తెలిపారు. వీరందరికి క్యాడర్ల వారీగా వైద్యారోగ్యశాఖలోని పర్మినెంట్ ఉద్యోగుల బేసిక్, అలవెన్సులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి – సమాన వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
17 వేల మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనీ, 510 జీవో అమలు కాని క్యాడర్లకు బేసిక్, డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితరాలను కలిపి గ్రాస్ శాలరీ నిర్ణయించాలనీ, హెచ్‌ఆర్ పాలసీని రూపొందించాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్ రాష్ట్ర నాయకులు ఎండీ సాదుల్లా, వందన, ఝాన్సీ వెంకటేష్, ఆనంద్ తదితరులున్నారు.