– ప్రజల సమయాన్ని వృథా చేస్తున్న వైనం
– ట్రాయ్ నిబంధనలూ దాటవేత
– కొత్త దారులను ఆశ్రయిస్తున్న కంపెనీలు, కాల్‌సెంటర్లు
– జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న నిపుణులు, పోలీసులు
న్యూఢిల్లీ: దేశంలో స్పామ్ కాల్స్ సంఖ్య తీవ్రంగా పెరుగుతున్నది. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ అంటూ ఇలా పలు రకాల కాల్స్‌తో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రజల ఫోన్ నెంబర్లు కంపెనీల వద్దకు ఎలా చేరుతున్నాయి? ఈ సమాచారమంతా వారికి ఎలా అందుతున్నది? అనే ప్రశ్నలు సాధారణ ప్రజల్లో తలెత్తుతున్నాయి. టెలికాం ఆపరేటర్లు, టెలి మార్కెటర్లు డేటా గోప్యత, జవాబుదారీతనం విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా అనే అనుమానాలు సైతం వారిలో కలుగుతున్నాయి. ముఖ్యంగా, ప్రభుత్వం వ్యక్తిగత గోప్యతకు కఠిన చర్యలు తీసుకుంటున్నదా? అనే ప్రశ్నలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి.
గోప్యతనే కాకుండా.. ప్రజల విలువైన సమయాన్నీ వృథా చేస్తూ, ఈ స్పామ్ కాల్స్ వారికి చికాకు తెప్పిస్తున్నాయి. లోకల్ సర్వే ప్రకారం.. సర్వే చేసిన 60 వేల మంది భారతీయులలో 60 శాతం మంది గతేడాది సగటున రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ కాల్స్‌ను పొందారు. ఇలాంటి స్పామ్ కాల్స్‌ను ఎదుర్కోవటానికి డీఎన్‌డీ, ఇతర అప్లికేషన్లు ఉనికిలో ఉన్నప్పటికీ.. కంపెనీలు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో తమ పనుల్లో బిజీగా ఉండే ప్రజలకు ఇది ఇబ్బందికరంగా మారుతున్నదని అంటున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో ల్యాండ్‌లైన్ నెంబర్లు, మొబైల్ నెంబర్ల మధ్య తేడా కనిపెట్టలేని రీతిలో స్పామ్ కాల్స్ వస్తున్నాయి. ఫలితంగా ప్రజలు స్పామ్ కాల్స్‌ను అంచనా వేయలేకపోతున్నారని నిపుణులు చెప్తున్నారు.
మెరుగైన మార్కెట్ రీచ్ కోసం కొన్ని కంపెనీలు, కాల్ సెంటర్లు ఇప్పుడు వర్చువల్ నెంబర్లను ఎంచుకుంటున్నాయని అంటున్నారు. వర్చువల్ నెంబర్లు వాస్తవ ఫోన్ నెంబర్లు కానీ, నిర్దిష్ట పరికరాలు, చిరునామాలతో ముడిపడి ఉండవు. కాల్ కోసం ఫిక్స్‌డ్ ల్యాండ్‌లైన్ నెంబర్ లేదా వర్చువల్ నంబర్ ఉపయోగించబడుతుందో లేదో చెప్పలేరు. ఉదాహరణకు, డెలివరీ ఏజెంట్ నుంచి వచ్చిన కాల్, స్పామర్ నుంచి వచ్చిన కాల్స్ రెండూ స్థానిక ఎస్టీడీ కోడ్‌ను కలిగి ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. వర్చువల్ నెంబర్ల విషయంలో వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (వీఎన్‌ఓ) వస్తాయి. వీఎన్‌ఓలు నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను కలిగి లేని టెలిఫోన్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (డీఓటీ) ద్వారా యూనిఫైడ్ లైసెన్స్‌లు మంజూరు చేసిన తర్వాత.. వారు క్లయింట్లకు వర్చువల్ నెంబర్లను అందిస్తారు. వీఎన్‌ఓలు మార్కెట్‌ను విస్తరించేందుకు వ్యాపారాలు తమకు నచ్చిన లోకల్ ఏరియా కోడ్‌లను ఉపయోగించుకునేలా చేస్తాయి.
ఇక చాలా కంపెనీలు మాన్యువల్ డయలింగ్‌ను నివారించటానికి అప్లికేషన్‌లను ఉపయోగిస్తున్నాయి. కంపెనీ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలో ఉండగా.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని తమ కార్యాలయం నుంచి కాల్స్ జరుగుతున్నాయని ఒక నమోదిత టెలీమార్కెటర్ తెలిపారు. ”బల్క్ ల్యాండ్‌లైన్ నెంబర్‌లను పొందటానికి టెలికాం ఆపరేటర్‌తో టెలిమార్కెటింగ్ వ్యాపారాన్ని నమోదు చేసుకోవాలి. వారు తమ ఆధారిత ప్రాంతంలో ఎక్స్‌ఛేంజ్ (సర్వీస్ ప్రొవైడర్) నుంచి రెండు ఎంబీపీఎస్ ప్రైమరీ రేట్ ఇంటర్‌ఫేస్ (పీఆర్‌ఐ)ని అద్దెకు తీసుకోవచ్చు. 20-30 లేదా అంతకంటే ఎక్కువ ల్యాండ్‌లైన్ నెంబర్‌లను పొందవచ్చు. ఈ లైన్లన్నిటినీ కలుపుతూ ఒక జంక్షన్ బాక్స్ ఉంటుంది. కొన్నిసార్లు పీఆర్‌ఐలు ఔట్‌గోయింగ్ కాల్స్ కోసం మాత్రమే ప్రోగ్రాం చేయబడతాయి” అని కొన్ని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.
దేశంలో చట్టవిరుద్ధమైన కాల్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ సమస్య ప్రతి చోటా, ముఖ్యంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఉన్నది. ఇలాంటి కాల్ సెంటర్లు స్పామ్ చేస్తూ ప్రజలను మోసగించటంలో బిజీగా ఉన్నాయి. వీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. స్పామర్లలో కేవలం నమోదుకాని టెలిమార్కెటర్లు (యూటీఎంలు) మాత్రమే కాకుండా.. కస్టమర్ల సమ్మతి లేకుండా అయాచిత వాణిజ్య కమ్యూనికేషన్లలో (యూసీసీలు)ని రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లు కూడా ఉంటారు. ట్రాయ్ మార్గదర్శకాలు యూసీసీలను ప్రారంభించకుండా కంపెనీలను నిషేధించాయి. ట్రాయ్ డీఎన్‌డీ యాప్, ఫిర్యాదుల హెల్ప్‌లైన్ వంటి చర్యలను తీసుకుంటున్నప్పటికీ.. కంపెనీల నుంచి స్పామ్ కాల్స్ కొనసాగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.
రిజిస్టర్డ్ టెలిమార్కెటర్ల ద్వారా స్పామ్ చేయటం కొంత వరకు అరికట్టబడినప్పటికీ.. దాని ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కాలేదని ట్రాయ్ గతంలో గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసిన ట్రాయ్ సమాచారం ప్రకారం.. గత నాలుగేండ్లలో నమోదిత టెలిమార్కెటర్లపై ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. యూటీఎంలకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు నాలుగు రెట్లు పెరిగాయి. ” చాలా సంస్థలు 10 అంకెల మొబైల్, ల్యాండ్‌లైన్ నెంబర్లను ఉపయోగించి ప్రమోషనల్ కాల్స్‌ను చేయటం ప్రారంభించాయి. ఈ సంస్థలు కమర్షియల్ కమ్యూనికేషన్‌ల కోసం ఆటో డయలర్, రోబో కాల్‌ల వినియోగాన్ని కూడా ఆశ్రయిస్తున్నాయి. నియంత్రణ నిబంధనలను దాటేస్తున్నాయి. దాదాపు ప్రతి ఒక్కరినీ ఇబ్బందికి గురి చేస్తున్నాయి” అని ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ సమచారం ప్రకారం.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 7.9 లక్షల ఫిర్యాదులతో యూటీఎంల నుంచి కాల్స్ గణనీయంగా పెరిగాయి. స్పామ్ కాలర్లపై చర్యలో భాగంగా 2.75 లక్షల టెలిఫోన్ నెంబర్లు డిస్‌కనెక్ట్ అయ్యాయి. 50 ఎంటీటీలు బ్లాక్ అయ్యాయి. ట్రాయ్ ఇప్పటికే టెలికాం ఆపరేటర్లతో సహా అన్ని సర్వీస్ ప్రొవైడర్లకు, నమోదు కాని మూలాల నుంచి ముందస్తుగా రికార్డ్ చేయబడిన, ప్రచార కాల్స్‌ను నిలిపివేయాలని ఆదేశాలను జారీ చేసింది.