రుణమాఫీకి విధివిధానాలు

Today BRS Statewide protests– ఆగస్టు 15లోపు చేయాలి…
– రాజస్థాన్‌, మహారాష్ట్రలో అధ్యయనం చేయండి
– రైతు సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌
– రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం సరఫరా
– కల్లాల వద్ద తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు
– 18న రాష్ట్ర క్యాబినెట్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీమేరకు ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే రుణమాఫీ అమలు చేస్తున్న రాజస్థాన్‌, మహారాష్ట్రలో అధ్యయనం చేసి, రైతు రుణమాఫీ విధి విధానాలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయవ్యయాల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరణ మార్గాలపై చర్చించారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని సూచించారు. అన్నదాతలను రుణ విముక్తులను చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలి
ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలనీ, దళారుల జోక్యం లేకుండా చూడాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్‌ చేసి రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్‌ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలనీ, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Spread the love