– కేంద్ర హోంమంత్రి అమిత్ షా
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఉగ్రవాదంపై పోరుకు త్వరలో విధివిధానాలు రూపొందిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందుకు సంబంధించి గురువారం జాతీయ దర్యప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్-2024’ ప్రారంభోత్సవంలో అమిత్ షా మాట్లాడారు. యూఏపీఏ కేసులతో ఎన్‌ఐఏ దాదాపు 95శాతం నేరారోపణ రేటును సాధించడంలో విజయం సాధించిందన్నారు. తీవ్రవాదంపై మోడీ ప్రభుత్వ చర్యల వల్ల గత దశాబ్దంలో 70శాతం ఘటనలు తగ్గాయని తెలిపారు. టెర్రర్ ఫైనాన్సింగ్, క్రిప్టో వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవటానికి, పోలీసు స్టేషన్ల నుంచి డీజీపీ కార్యాలయం వరకు సమన్వయ విధానాన్ని అనుసరించాలన్నారు. టెర్రర్-ఫైనాన్సింగ్‌ను ఆపడానికి 25 పాయింట్ల సమగ్ర ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. జిహాదీ ఉగ్రవాదం నుంచి ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు, నక్సల్స్, నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాల వరకు అనేక చర్యలు వంటివి ఇందులో భాగమని వెల్లడించారు. అవసరమైనప్పుడు సంకోచం లేకుండా యూఏపీఏ ఉపయోగించాలని, దర్యాప్తులో ఎన్‌ఐఏ సహాయం తీసుకోవాలని సూచించారు. ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, కానీ రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు వాటి స్వంత సరిహద్దులు ఉన్నాయని తెలిపారు. కాబట్టి అన్ని రాష్ట్రాలు ఎన్‌ఐఏ ఉపయోగాన్ని నొక్కి చెప్పడంతో పాటు, ఉగ్రవాదంపై పోరాడే సంస్థలతో సమన్వయాన్ని పెంచుకోవాలని సూచించారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తోందని, అంతర్గత భద్రత కోసం సరిహద్దుల వద్ద ఇప్పటి వరకు 36 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల కట్టడి విషయంలో మోడీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ నినాదంతో ముందుకెళ్తోందని, ప్రస్తుతం ప్రపంచమంతా ఈ విధానాన్నే అనుసరిస్తోందన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని, అయితే ఉగ్రవాదులు ఎలా దాడి చేసినా దాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు యువ అధికారులకు అత్యున్నత సాంకేతిక నైపుణ్యం అవసరమని నొక్కిచెప్పారు. భవిష్యత్తులో వారి శిక్షణలోనూ దీన్ని భాగం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ (ఐబీ) తపన్ కుమార్ దేకా, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ సింగ్, ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ డేట్ సహా పలువురు పాల్గొన్నారు. ఈ సదస్సుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సీనియర్ పోలీసు అధికారులు, ఉగ్రవాద వ్యతిరేక సమస్యలతో వ్యవహరించే కేంద్ర ఏజెన్సీలు, విభాగాల అధికారులు, లా, ఫోరెన్సిక్స్, సాంకేతికత మొదలైన సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు హాజరయ్యారు.