ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

– రైతులకు అసలు, మిత్తి రుణమాఫీ చేయాలి 

– డాక్టర్ పన్యాల శ్రావణ కుమార్ రెడ్డి 
నవతెలంగాణ- దుబ్బాక
తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ విషయంలో తీవ్ర అన్యాయం చేసిందని, రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో లక్షరూపాయల రుణమాఫీతో పాటు 2018 నుండి 2023 వరకు ఐనా వడ్డీనీ రైతులకు అందించాలని, మరోసారి ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోందనీ టీపిసిసి ఉపాధ్యక్షులు (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు) డాక్టర్ పన్యాల శ్రావణ కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. దుబ్బాక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రావణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు గజమాలను వేసి స్వాగతం పలికారు. అనంతరం రెడ్డి ఫంక్షన్ హాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మరోసారి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు రెడీ అవుతున్నారాన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు.రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని నేటికీ రుణమాఫీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని ఎన్నికల్లో చెప్పి నేటికీ అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు పంపించడంలో జాప్యం చేయడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు ఏకకాల రుణమాఫీతో పాటు ఇప్పటి వరకు ఐనా వడ్డీని వారీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 3016 నిరుద్యోగ భృతిని ఇప్పటివరకు చెల్లించలేదని, వారికి ఉద్యోగ కల్పనలో ఈ ప్రభుత్వం చిత్తశద్ధితో పని చేయడం లేదనీ అన్నారు.సీఎం కేసీఆర్ కు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని  సూచించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోనూ,ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని  కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గెలుపులో భాగస్వాములు కావాలన్నారు. కాంగ్రెస్ నాయకులు చంద్రీ సంజీవ్ రెడ్డి ,దండబోయిన శ్రీనివాస్, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు నక్క బాల వెంకన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు గున్నాల సాయి కృష్ణ ,సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్, దుబ్బాక మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు అందే రాజి రెడ్డి, ఎస్సీ సెల్ కార్యదర్శి బ్యాగరి నవీన్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Spread the love