వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి

వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి– ఒకేసారి రుణమాఫీ చేయాలి
– గ్యారంటీల విషయంలో పోరాటాలు నిర్వహిస్తాం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చిట్యాలటౌన్‌
కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక మేకల లింగయ్య భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేవనే సాంకేతిక కారణాలు చూపి అమలు చేయడం లేదని అన్నారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో చేసిన తప్పులను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేయకుండా రెండు లక్షల రుణమాఫీని ఒకేసారి అమలు చేయాలని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసాను అమలు చేయాలని, వడ్లకు దొడ్డు, సన్నాలు అని తేడా లేకుండా క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాల వల్ల మహిళలు పడే ఇబ్బందులు అధిగమించడానికి బస్సుల సంఖ్యను పెంచి అన్ని స్టాపుల్లో బస్సులు ఆపాలని సూచించారు.
ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే మౌలికపరమైన సమస్యలను పరిష్కరించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరు గ్యారంటీల విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య, నాయకులు శీల రాజయ్య, చంద్రమౌళి ఉన్నారు.

Spread the love