– లేకుంటే మరో రైతాంగ ఉద్యమం
– ఈనెల 31న రాష్ట్ర సదస్సు : పోస్టర్ ఆవిష్కరణలో ఎస్‌కేఎం రాష్ట్ర నేతలు
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ఢిల్లీ రైతాంగ ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా రాసిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) డిమాండ్ చేసింది. రైతులకు అనుకూలంగా ప్రధాని ఫసల్ బీమా పథకాన్ని సవరించాలని కోరింది. రైతుల డిమాండ్ల సాధన కోసం మరో ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఎస్‌కేఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈనెల 31న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాష్ట్ర సదస్సు’ నిర్వహించనున్నట్టు తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్ధూంభవన్‌లో రాష్ట్ర సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను నాయకు లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎం రాష్ట్ర నాయకులు పశ్యపద్మ, టి.సాగర్, రాయల చంద్రశేఖర్, వి.ప్రభాకర్, మండల వెంకన్న, మామిడాల బిక్షపతి, మస్కుల మట్టయ్య, నాగిరెడ్డి, ప్రమీల, జక్కుల వెంకటయ్య, ఆకుల పాపయ్య, బి.భాస్కర్, కె.కాంతయ్య, తూడారామ్ నాయక్, మూఢ్ శోభన్, ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలనీ, విద్యుత్ సవరణ బిల్లు-2020ను రద్దు చేయాలనీ, రైతుల రుణాలను మాఫీ చేసి, రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమా ండ్ చేశారు. రైతు ఉద్యమ సమయంలో రైతులపై నమోదు చేసిన కేసును తక్షణమే ఎత్తి వేయాల న్నారు. ఎస్‌కేఎంను మరింత బలోపేతం చేసి, రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ప్రధాని మోడీ రైతాంగానికి లిఖితపూర్వకంగా రాసిచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడిస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి, రైతాంగ సమస్యలను పరిష్కరించేలా పోరాటం చేస్తామ న్నారు. అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలివ్వాల న్నారు. కౌలు రైతులను గుర్తించి, వారికి బ్యాంక్ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రుణభారంతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారనీ, అందుకే రుణ విమోచన చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్‌లోని లోపాలను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు, వ్యవసాయ, స్వచ్చంద సంస్థ లు కూడా రాష్ట్ర సదస్సులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ డిమాండ్ల సాధనకు ఐక్యంగా పోరాటం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా ఎస్‌కేఎంను విస్తరిస్తున్నామనీ, ఉత్తరా ఖండ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో కమిటీ ల నిర్మాణం చేపడుతామని తెలిపారు. రైతు ఉద్యమ సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.