ప్ర‌చారం ఘ‌నం..ప్ర‌యోజ‌నం స్వ‌ల్పం

– ఆహార సబ్సిడీ పద్దులో కోతలు
– నామమాత్రపు కేటాయింపులతో సరి
– ఉచిత రేషన్‌ పంపిణీతో రాజకీయ లబ్దికి బీజేపీ ప్రయత్నం
దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా చెప్పుకుంటారు. ఈ పథకం తమపై ఓట్ల వర్షం కురిపిస్తుందని కమలనాథులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ పథకం యూపీఏ ప్రభుత్వ పాలనలో చేపట్టిందే. కాకపోతే అప్పుడు సబ్సిడీ ధరపై పేదలకు ఆహారధాన్యాలు అందించే వారు. ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. అయితే ఈ ఉచిత పంపిణీ వల్ల నిరుపేదలు, పేదలకు ఆర్థికంగా పెద్దగా ఒరుగుతోంది ఏమీ లేదు. అదీకాక ప్రభుత్వం పెట్టే మొత్తం బడ్జెటరీ వ్యయంలో ఈ ఆహార సబ్సిడీ పద్దుకు విదిలిస్తోంది ఐదు శాతం కంటే తక్కువగానే ఉంటోంది. అంటే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం నామమాత్రమే.
న్యూఢిల్లీ:
నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో అందరికీ సుపరిచితమైన సంక్షేమ పథకం ఒకటి ఉంది. అదే ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై). ఈ పథకం కింద ఉచిత ఆహారధాన్యాలు పొందేందుకు దేశంలోని 80 కోట్ల మంది అర్హులు. ఈ పథకం ప్రధానికి మంచి పేరే తెచ్చి పెట్టింది. అయితే దీని నేపథ్యాన్ని గమనిస్తే…2013లో ప్రజల నుండి వచ్చిన డిమాండ్‌ మేరకు అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలోని గ్రామీణ జనాభాలో 75శాతం మంది, పట్టణ జనాభాలో 50 శాతం మంది సబ్సిడీ ధరపై ఆహారధాన్యాలు పొందారు. ఇతర ప్రభుత్వ పథకాల మాదిరిగా కాకుండా దీనికి చట్టరూపం కల్పించారు.
ఆహార భద్రతా చట్టం అంటే…
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అత్యంత నిరుపేద కుటుంబాలకు నెలకు మొత్తం 35 కిలోల ఆహారధాన్యాలు అందించారు. కిలో బియ్యం మూడు రూపాయలు, కిలో గోధుమలు రెండు రూపాయలు, కిలో తృణధాన్యాలు రూపాయికి అందజేశారు. ఇక పేద కుటుంబాలకు సంబంధించి ఒక్కో లబ్దిదారుడికి ఇవే ధరలపై ఐదు కిలోల ఆహారధాన్యాలు అందించారు. మోడీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగింది.
రేషన్‌ సంచులపై మోడీ బొమ్మ
2020లో కోవిడ్‌ మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసినప్పుడు పేదలు పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆహారధాన్యాల పంపిణీ పరిమాణాన్ని రెట్టింపు చేసింది. ఎనిమిది నెలల పాటు వాటిని ఉచితంగా అందజేసింది. గత సంవత్సరం జనవరి 1 నాటికి కోవిడ్‌కు సంబంధించిన అన్ని సహాయక చర్యలను నిలిపివేసినప్పటికీ ఉచిత ఆహారధాన్యాల పంపిణీని మాత్రం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 1 నుండి ఐదు సంవత్సరాల పాటు ఇది కొనసాగుతుంది. అయితే నిరుపేదలు, పేదలకు అందజేస్తున్న ఆహారధాన్యాల సంచులపై ప్రధాని మోడీ చిత్రాన్ని ముద్రించారు. దీంతో అందరూ ఇది మోడీ పథకమేమోనని భావించారు. వాస్తవానికి సబ్సిడీ ధరపై ఆహారధాన్యాల పంపిణీ అనేది యూపీఏ పాలనలోనే మొదలైంది. కాకపోతే ఇప్పుడది ఉచిత పంపిణీగా మారింది. అంతే తేడా.
గోరంత ప్రయోజనమే
వాస్తవానికి ఆహారధాన్యాల ఉచిత పంపిణీ పథకం నిరుపేదలు, పేదలకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం కలిగించలేదు. అత్యంత నిరుపేద కుటుంబాలు తాము వినియోగించే ఆహారధాన్యాల పరిమాణం ఆధారంగా బియ్యంపై నెలకు రూ.70, గోధుమలపై రూ.105 మాత్రమే ప్రయోజనం పొందాయి. ఈ కొద్దిపాటి వెసులుబాటుతో పేదల కష్టాలు గట్టెక్కుతాయా? రేషన్‌ సంచులపై మోడీ బొమ్మను ముద్రించినంత మాత్రాన వారంతా బీజేపీకే ఓటేస్తారా? అసలు పీఎంజీకేఏవై ద్వారా ఎంతమంది లబ్ది పొందారు అనేది పరిశీలిస్తే జాతీయ స్థాయిలో 2023 జూన్‌ 30 నాటికి 8.95 కోట్ల మంది నిరుపేదలు, 71.15 కోట్ల మంది పేదలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. అయితే పేదలతో పోలిస్తే నిరుపేదలే ఎక్కువ లబ్ది పొందారు. ఎందుకంటే వారికి పేదల కంటే ఎక్కువ పరిమాణంలో ఉచితంగా ఆహారధాన్యాలు లభించాయి.
రాజకీయ ప్రభావం ఉంటుందా?
దేశంలోని పలు రాష్ట్రాలు అర్హత కలిగిన కుటుంబాల న్నింటికీ దాదాపుగా ఆహారధాన్యాలు అందజేస్తున్నాయి. 2016 నాటికే జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయడంతో ఇదేమీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌ మాత్రం లక్ష్యానికి దూరంగానే ఉంది. అసోం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, ఒడిషా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు జనాభాలో 80 శాతం మందిని లబ్దిదారులుగా గుర్తించాయి. ఈ రాష్ట్రాలన్నీ దాదాపుగా రాజకీయ ప్రాధా న్యత కలిగినవే. లోక్‌సభలోని మొత్తం స్థానాల్లో మూడో వంతు స్థానాలు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆహారధాన్యాల పంపిణీ ఓట్లను రాలిస్తే…లేదా కనీసం కొంతమంది లబ్దిదారులైనా పాలక పక్షానికి ఓటేస్తే…ఈ పథకం చూపే రాజకీయ ప్రభావం గణనీయంగానే ఉంటుంది.

ఆర్థిక భారం తక్కువే
సబ్సిడీపై పంపిణీ నుండి ఉచిత పంపిణీకి నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడిందో పరిశీలిద్దాం. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆహారధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ ఖర్చును కలిపి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో ‘ఆహార సబ్సిడీ’గా చూపుతోంది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు కోసం ప్రభుత్వం సుమారు 6 శాతం (మొత్తం బడ్జెట్‌ వ్యయంలో) ఖర్చు చేసింది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ఆహార సబ్సిడీని పెంచింది. 2016 నుండి 2020 వరకూ ఆహార సబ్సిడీపై ప్రభుత్వ వ్యయం తగ్గుతూ వచ్చింది. 2020లో మొత్తం ప్రభుత్వ వ్యయంలో ఆహార సబ్సిడీ కోసం పెట్టిన ఖర్చు కేవలం 4 శాతం మాత్రమే. కోవిడ్‌ తర్వాత ఈ పద్దు కింద వ్యయం ఎప్పుడూ 5 శాతం కంటే తక్కువగానే ఉంటోంది. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే సబ్సిడీపై పంపిణీ నుండి ఉచిత పంపిణీకి మారడం వల్ల ప్రభుత్వంపై పెద్దగా ఆర్థిక భారం పడలేదు. కానీ ప్రచారం మాత్రం లభించింది.
10-14 కోట్ల మంది దూరం
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమంటే ఆహారధాన్యాల ఉచిత పంపిణీ 80 కోట్ల మంది ప్రజలకు ఎంతో కొంత లబ్ది చేకూరుస్తున్నప్పటికీ మరో 10-14 కోట్ల మందికి ఈ పథకం వర్తించడం లేదు. ఈ లెక్కలు కూడా 2011 నాటివి. అప్పటి నుండి జనగణన సహా పలు పత్రాలను తాజా పరచలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అర్హులైన లబ్దిదారుల సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు.

Spread the love