సివిల్స్-2022 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ‘పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ పట్టుదలతో చదివితే ఏ పోటీ పరీక్ష అయినా సాధించొచ్చు.. అందుకు పేద, ధనిక భేదం లేదు.. ప్రతిభ, ప్రజ్ఞ ఉన్న ప్రతిఒక్కరూ విజయ తీరాలకు చేరుకోవచ్చు’ అని నిరూపించారు. సరైన లక్ష్యం, కృషి ఉంటే దేన్నయినా సాధించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పారు. అపజయాలకు కుంగి పోకుండా విజయతీరాలను చేరుకున్నారు. తండాలు, దళిత వాడల నుంచి దేశ అత్యుత్తమ సర్వీసులకు ఎంపికై నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డల చిరుపరిచయం ఈ వారం జోష్.
– అనంతోజు
నిరాశ పడొద్దు : ఉమా హారతి
ఏదో ఒక ర్యాంకు వస్తే చాలనుకున్నాను. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు.
ముందుగా జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టు ఉండేది. ఆ తర్వాత ఆంత్రోపాలజీకి మారాను. ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్ అయినా నిరాశ పడొద్దు. ఎవరి నుంచైనా మనం స్ఫూర్తి పొందవచ్చు.
నేను ఐదేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నా. ఈ పరీక్ష ప్రక్రియలో చాలా ఫెయిల్యూర్స్ చూశాను. అయినా నిరాశ పడలేదు. విశ్వాసంతో చదువుతూ ముందకెళ్లాను. ఈ ప్రాసెస్‌లో కుటుంబ సభ్యుల సపోర్టు, ఎమోషనల్ సపోర్టు చాలా అవసరం. అది ఉంటే చాలు. సమాచారం, పుస్తకాలు.. అన్నీ ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతాయి.
కానీ ఎమోషనల్, ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకదు కదా.. అదే చాలా అవసరం. మహిళలు, పురుషులు ఎవరైనా సరే.. కుటుంబం సపోర్టు చేస్తే సాధించవచ్చు.
నూటికి నూరు శాతం మా నాన్నే నాకు స్ఫూర్తి, ప్రేరణ. మహిళల విద్యపై ఎక్కువగా దృష్టి పెడతాను.
తొలి ప్రయత్నంలోనే విజయం వరించింది :శాఖమూరి సాయి ఆశ్రిత్
మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి. 22 ఏండ్లకే సివిల్స్ సాధించడం నమ్మలేకపోతున్నా.
అది కూడా ఆలిండియా 40వ ర్యాంక్. నాన్న శాఖమూరి అమర్ క్రెడారు (స్థిరాస్తి వ్యాపారుల సంఘం) కోశాధికారి.
అమ్మ పద్మజ. వరంగల్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి వరకు, హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్, రాజస్థాన్ బిట్స్ (పిలానీ) లో బీటెక్ చదివాను.
బీటెక్ ఫైనల్ సెమీస్టర్‌లో ఉండగానే ప్రిపరేషన్ మొదలుపెట్టాను. బీటెక్ పూర్తి చేసిన వెంటనే హైదరాబాద్ సీబీఎస్ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను.
2022లో మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా 40వ ర్యాంక్ సాధించాను. కష్టపడి చదివాను. కష్టపడి చదివితే విజయం వరిస్తుందనడానికి నేనే ఉదాహరణ.
సమాజాన్ని చదువుకున్నాను: అజ్మీరా సంకేత్‌కుమార్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ అనేక గిరిజన తండాలు నాగరికతకు దూరంగా బతుకున్నాయి. అందుకే గిరిజన తండాల్లో చైతన్యం నింపేందుకు కృషి చేస్తాను. మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి. చిన్నప్పటి నుంచి చదువుపై అమితమైన ఇష్టం. అమ్మ సవిత ఇస్రోలో ఉద్యోగం. నాన్న ప్రేమ్ సింగ్ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్. వాళ్లను చూస్తూ పెరిగిన నేను అలాగే గౌరవంగా బతకాలనుకున్నాను. ఢిల్లీ ఐఐటీలో 2017లో బీటెక్ చేసి.. జపాన్‌లో రీసెర్చింగ్‌లో ఉద్యోగం చేస్తున్నా కానీ, ఏదో అసంతృప్తి వెంటాడేది. సివిల్స్ సాధించాలని నిర్ణయించుకొని హైదరాబాద్ వచ్చేశాను. ఎలాంటి కోచింగ్ లేకుండా స్వతహగానే ప్రిపేర్ అయ్యాను. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో 35వ ర్యాంక్ సాధించాను. అందరిలా రోజుకు 12, 14 గంటలు నేను చదవలేదు. సమాజాన్ని చదువుకున్నాను. అదే నన్ను ఈ రోజు విజేతగా మీ ముందు నిలిపింది.
ఓటమి పట్టుదలను పెంచింది : గ్రందే సాయికృష్ణ
గతంలో మూడుసార్లు సివిల్స్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయినప్పటికీ నిరాశపడకుండా చదివి తానేంటో ఫలితాల ద్వారా చాటి చెప్పాడు. మాది కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీ. నాన్న శ్రీనివాస్ ఓ లాడ్జి మేనేజర్. అమ్మ నాగలక్ష్మి గృహిణి. మధ్యతరగతి కుటుంబం. అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. పదో తరగతి వరకు కొత్తగూడెంలోని సూర్యోదయ పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియట్ విజయవాడలోని శ్రీగాయత్రి జూనియర్ కాలేజీ, బీటెక్ కేరళలోని కాలికేట్ నగరంలోని ఎన్‌ఐటీలో పూర్తి చేశాను. ఆ తర్వాత ఎల్‌అండ్‌టీ కంపెనీలో రెండేండ్లు ఉద్యోగం చేసి మానేసి సివిల్స్‌పై దృష్టి పెట్టాను. ఎలాంటి శిక్షణ లేకుండా రోజుకు సుమారు 10 గంటల చొప్పున మూడేండ్లు కష్టపడ్డాను. యూపీ ఎస్సీ పాత ప్రశ్నాపత్రాలు, ఆన్‌లైన్‌లో మోడల్ పేపర్స్‌తో స్వయంగా మాక్ టెస్ట్‌లు పెట్టుకొని నాకు నేనే ఏయే అంశాల్లో వెనుక బడ్డానో గుర్తించి తిరిగి ప్రిపరేషన్ ప్రారంభించాను. మొదటిసారి 2019లో సివిల్స్ రాసి మెయిన్స్‌కు అర్హత సాధించాను కానీ, మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. 2020, 2021 ఇదే సిన్ రిపీట్ అయింది. అయినా కుంగిపోలేదు. నాలో సాధించాలన్న కసి రెట్టింపు అయింది. 2022లో మెయిన్స్‌కు అర్హత సాధించాను. ఈ ఏడాది మెయిన్స్ కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాను. ఇంటర్వ్యూలో కూడా సెలక్ట్ అయి ఏకంగా 293వ ర్యాంకు సాధించాను. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నిరాశను ఆవరించ నీయలేదు. నాకు నేనుగా దృఢంగా ఉండటానికి ప్రయత్నం చేశాను. ఓడిపోయిన ప్రతిసారి నాలో కసిని పెంచింది. సాధించాలన్న పట్టుదల పెరిగింది. అదే నా విజయ రహస్యం.
కష్టాలు, కన్నీళ్లు నా లక్ష్యం ముందు చిన్నబోయాయి : డోంగ్రీ రేవయ్య
మాది కుమురంభీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగేడ్ గ్రామం. నా నాలుగేండ్లటప్పుడే నాన్న మనోహర్ చనిపోయారు. గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయే పూరి గుడిసె. ముగ్గురు పిల్లలతో అమ్మ విస్తారి భారు రోజూ బతుకు పోరాటమే చేసింది. అడవిలో కట్టెలు కొట్టుకొచ్చి, ఇంటింటికీ తిరిగి అమ్మేది. ప్రభుత్వ పాఠశాలలో వంట పని చేసేది. సెలవుల్లో కూలి పనులకూ వెళ్లేది. అమ్మ చదువుకోకపోయినా, చదివితేనే బతుకు మారుతుందని గట్టిగా నమ్మేది. అదే మాకు నేర్పింది. కాగజ్ నగర్‌లోని శిశుమందిర్ లో ఒకటి నుండి 5వ తరగతి వరకు, ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో, హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. 2012లో నాకు ప్రతిష్ఠాత్మక మద్రాస్ ఐఐటీలో సీటొచ్చింది. కానీ, రూ.22 వేలు కట్టాలి. రెక్కడితే గానీ డొక్కాడని కుటుంబం. అంత డబ్బెక్కడిది? ఆ గడ్డు పరిస్థితిలో.. ప్రతికలో వచ్చిన ఓ కథనం చదివి అప్పటి మా కలెక్టర్ అశోక్ స్పందించి సాయం చేశారు. మరికొంత మంది తమ వంతు సాయం అందించారు. అప్పుడే నాకు ఒక సివిల్ సర్వెంట్‌కి ఉన్న పవరేంటో అర్థమైంది. అది సాధించాలనే అప్పుడే సంకల్పించుకున్నాను. దానికంటే ముందు ఆర్థికంగా కొంత స్థిరపడితే.. అమ్మకు భారం తగ్గుతుందని అనుకున్నా. ఐఐటీ మద్రాసులో ఇంజినీరింగ్ పూర్తయ్యాక ‘గేట్’ రాశా. మంచి ర్యాంకు రావడంతో ఓఎన్‌జీసీలో రూ.22లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఐదేండ్లు అక్కడ పని చేస్తూనే.. సివిల్స్‌కు ప్రిపెర్ అయ్యాను. 2021లో తొలిసారి సివిల్స్ పరీక్షలు రాసి ఇంటర్వ్యూ వరకూ వెళ్లా. కానీ విజయం సాధించలేదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని సీనియర్ల సాయంతో దాన్ని అధిగమించా. హైదరాబాద్‌లోని బాల లత గారి దగ్గర కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నా. రెండోసారి గురి తప్పలేదు. నాకొచ్చిన 410 ర్యాంకుకి ఐపీఎస్ రావొచ్చు. ఆర్థిక చేయూత లేక చాలామంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు. నా పరిధిలో అలాంటి వారికి ముందుగా సాయం చేయాలనుకుంటున్నా.