– విధానాల మార్పు ఐక్య ఉద్యమాలతోనే సాధ్యం :ఎస్‌డబ్ల్యూఎఫ్ రౌండ్‌టేబుల్‌లో కార్మిక సంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజారవాణాకు ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పలు కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఆ దిశగా ప్రభుత్వాల విధానాల మార్పు ప్రజాక్షేత్రంలో జరిగే ఐక్య ఉద్యమాలతోనే సాధ్యమవుతుందని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆధ్వర్యాన ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ‘ఆర్టీసీలను విస్తరించి, బలోపేతం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన పెట్టుబడి పునరుద్ధరించాలి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి ఫెడరేషన్ అధ్యక్షులు వీరాంజనేయులు అధ్యక్షత వహించారు. ఆలిండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఆర్గనైజేషన్ ఈనెల 13 నుంచి 20వ తేదీల మధ్య ఆర్టీసీల పరిరక్షణ కోసం దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మాట్లాడుతూ టీఎస్‌ఆర్టీసీలో కార్మికులు ఎదుర్కొంటున్న పనిభారాలు, తగ్గుతున్న బస్సులు, ప్రయివేటీకరణ ప్రయత్నాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయాల్లోని లోపాలను ఎత్తిచూపారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీల్లోకి బలవంతంగా ప్రయివేటు బస్సుల్ని ప్రవేశపెడుతున్నారనీ, దీనివల్ల సంస్థలోని కార్మికులు నష్టపోవడమే కాకుండా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం యువతరం ఉద్యోగాలు కూడా కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీలు కనుమరుగైతే ప్రధానంగా నష్టపోయేది ప్రజలేనని స్పష్టం చేశారు. వారికి ఈ ప్రమాదాన్ని అర్ధమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ మాట్లాడుతూ మోటారు వాహన చట్టం-2019ని రద్దు చేయనిదే, ఆర్టీసీల పరిరక్షణ సాధ్యం కాదన్నారు. దానికోసం ప్రజలు, కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ప్యాసింజర్లను సమకూర్చుకొనే బాధ్యత కూడా డ్రైవర్, కండక్టర్లపై పెట్టడం సరికాదన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టీ సాగర్ మాట్లాడుతూ ప్రజారవాణా ప్రభుత్వాల బాధ్యత అనీ, దానిలో లాభనష్టాలు బేరీజు వేయరాదని అన్నారు. కార్పొరేట్లకు రూ.11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం, ప్రజలకోసం ఆర్టీసీలకు రాయితీలు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తులపై పాలకులు కళ్లు పడ్డాయనీ, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులు, ప్రజలపైనే ఉన్నదని స్పష్టంచేశారు. బీఆర్‌టీయూ ఉపాధ్యక్షులు వేముల మారయ్య మాట్లాడుతూ ప్రజారవాణాలో ప్రయివేటు భాగస్వామ్యం పెరిగిందనీ, ఆ నష్టాన్ని కార్మికవర్గం ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నదని అన్నారు. కార్మిక సంఘాల ఆందోళనల్లో కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొనాలనీ, తమదాకా కష్టం వచ్చేదాకా వేచిచూసే ధోరణి మంచిది కాదన్నారు. ఏఐయూటీయూసీ ప్రధాన కార్యదర్శి భరత్ మాట్లాడుతూ ఆర్టీసీల పరిరక్షణపై బలమైన ఉద్యమ నిర్మాణం జరిగితేనే కార్మికుల్లో ధైర్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా ప్రజల మైండ్‌సెట్‌ను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, దీన్ని తిప్పికొట్లాలని చెప్పారు. ఐఎన్‌టీయూసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఎమ్‌బీ విజయకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆర్టీసీలో కార్మికోద్యమంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ ఉపాధ్యక్షులు సీ వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటీకరిస్తుంటే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతున్నదని అన్నారు. ప్రజారవాణా పరిరక్షణ ప్రజల బాధ్యత అనీ, దాన్ని కార్మిక సంఘాలు విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు కే గంగాధర్, కే బిక్షపతి, కే గీత, చంద్రప్రకాశ్, వీ రాములు తదితరులు పాల్గొన్నారు.