అమెరికాలో రాహుల్ గాంధీకి నిరసన సెగ

నవతెలంగాణ – అమెరికా
అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి నిరసన సెగ తగిలింది. రాహుల్ గాంధీ కాలిఫోర్నియాలో నిర్వహించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఖలిస్థానీ మద్దతుదారులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ వారు నినాదాలు చేయడంతో సభలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఖలిస్థానీ మద్దతుదారుల నినాదాలపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరినీ అభిమానిస్తుందని తెలిపారు. తాము ఎవరి పట్ల ఆగ్రహావేశాలను, ద్వేషాన్ని ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. కాగా, రాహుల్ సభలో ఖలిస్థాన్ నినాదాల వీడియో క్లిప్పింగ్ ను బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇది 1984 నాటి మారణహోమానికి స్పందన అని వెల్లడించారు. మీరు రాజేసిన విద్వేష అగ్ని ఇప్పటికీ మండుతూనే ఉందని మాల్వియా వ్యాఖ్యానించారు.

Spread the love