తహసిల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్లతో రైతుల ఆందోళన

– తమ భూములను తమకే కేటాయించాలని డిమాండ్
నవతెలంగాణ- దంతాలపల్లి : సాగు భూములను అన్యాయంగా లాక్కోవద్దని తమ భూములను తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు మంగళవారం నర్సింహులపేట తహసిల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిల్లతో ఆందోళన చేసి బటాయించారు. బాధిత రైతులు జాటోతు వెంకన్న, జాటోతు రాందాస్, జాటోతు నీల, హరి, సూర్య, జాటోతు లక్ష్మణ్, బిక్షపతి గణేష్ తెలిపిన వివరాల ప్రకారం కొమ్ములవంచ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 180 బై బి2బై3, 180 బై బి బై 3లో 2.11 ఎకరాల భూమి రూప్లతండ గ్రామపంచాయతీ పరిధి ఎర్ర సక్రు తండకు చెందిన రైతులు జాటోతు సుక్య, జాటోతు తేజ్యాల పేర్లపై ఉన్నది. వారసత్వం కింద వాటాలుగా పంచుకొని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ కుటుంబాన్ని సాదుతున్నట్లు తెలిపారు. ఈనెల మూడున అదే సర్వే నెంబర్ల భూమిలో ఇండ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలని తహసిల్దార్ వివేక్, రెవిన్యూ అధికారులు కుట్రపన్ని ఇండ్ల స్థలాల పంపిణీ పేరుతో సాగు భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సాగు భూమి ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నంత అధికారుల ఆదేశాల మేరకు ఆ భూమిని చదును చేయడం జరుగుతుందన్నారు.
Spread the love