![](https://navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230826-WA0016.jpg)
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ- కంటేశ్వర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు ఉంటాయని కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నిత్యవసర సరుకులు ధరలు మరియు నిరుద్యోగం ఇండ్లు ఇండ్ల స్థలాల సమస్యల పైన సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు గ్రామ వార్డు స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిరసన కార్యక్రమాలకు సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశం సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరగటంతో పేద మధ్యతరగతి ప్రజానీకం వాటిని కొనుగోలు చేయలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం వాటిని అదుపు చేయటానికి చర్యలు చేపట్టడం లేదని ఒక నెలలోనే కూరగాయల ధరలు 37% పెరిగాయని మిగతా నిత్యవసర సరుకుల ధరలు 50 నుండి 200 శాతం పెరిగాయని అదే విధంగా వంట గ్యాస్ ధర 1200 రూపాయలకు పెరిగిందని వీటికి తోడు నిరుద్యోగం పెరిగి పేదరికం తాండవిస్తుందని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి లక్షలాదిమంది పేదలు ఇళ్ల స్థలాలు లేక డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రాక ఇబ్బందులు పడుతున్నారని ఇండ్ల నిర్మాణానికి ఇప్పుడు మూడు లక్షలు ఇస్తామని ప్రకటించటం మూలంగా అవి ఏమాత్రం సరిపోవని దాన్ని ఆరు లక్షల పెంచాలని స్థలం లేని పేదలందరికీ ఇంటి స్థలం మంజూరు చేయాలని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు దశల వారి ఆందోళనలకు సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ పిలుపునివ్వడం జరిగిందని దాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, మల్యాల గోవర్ధన్ మరియు నాయకులు కటారి రాములు తదితరులు పాల్గొన్నారు.