– పల్లా గో బ్యాక్ అంటూ జేఏసీ నాయకుల నినాదాలు
నవతెలంగాణ-చేర్యాల
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జనగామ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించడంతో బుధవారం ఆయన కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొమురవెల్లి నుంచి చేర్యాల మీదుగా జనగామ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాగా, సిద్దిపేట జిల్లా చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేస్తున్న నాయకులు.. పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనను గమనించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి దీక్షా శిబిరం వద్దకు వచ్చి జేఏసీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారు పల్లా గో బ్యాక్, చేర్యాల ద్రోహి పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆయన వెనుతిరిగారు. అటు జేఏసీ నాయకులు, ఇటు పల్లా అనుచరుల నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు గ్రూపు నాయకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.