సిర్పూరు ఎమ్మెల్యే కోనప్పకు నిరసన సెగ

సిర్పూరు ఎమ్మెల్యే
కోనప్పకు నిరసన సెగ– మళ్లీ ఎందుకొచ్చావని గ్రామస్తుల ఆగ్రహం
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సోమవారం నిరసన సెగ తగిలింది. ఐదేండ్ల కిందట ఓట్ల కోసం వచ్చి.. మళ్లీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామ పంచాయతీ సిర్పూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ పంచాయతీ పరిధిలో 1400 పై చిలుకు ఓట్లుండగా, ఈ గ్రామానికి ఇటు దహెగాం మండల కేంద్రం నుంచి, అటు భీమిని మండల కేంద్రం నుంచి సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే కోనప్ప మంగళవారం గ్రామానికి ప్రచారం నిమిత్తం వెళ్లారు. స్థానికులు సమస్యల గురించి అడిగారు. వారికి సర్ది చెప్పిన ఎమ్మెల్యే గ్రామంలోనే మరో వాడకు వెళ్లగా, అక్కడ కూడా ఇదే నిరసన ఎదురైంది. దీంతో నిగ్రహం కోల్పోయిన ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడటంతో.. ”మా ఓట్లు అవసరం లేనప్పుడు ఎందుకు వచ్చావంటూ” నిలదీశారు. భీమిని ఎస్‌ఐ ప్రశాంత్‌ జోక్యం చేసుకొని గ్రామస్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగానే కోనేరు కోనప్ప తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు.

Spread the love