– యోగా డేలో పాల్గొనకుండానే ధర్మేంద్ర ప్రధాన్ వెనకడుగు
– కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహించాలి: సీతారాం ఏచూరి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ ఆయనకు నల్లజెండాలతో విద్యార్థులు స్వాగతం పలికారు. నీట్, యూజీసీ నెట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా డే కార్యక్రమం కోసం వెళ్లిన కేంద్ర విద్యాశాఖ మంత్రిని విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్లజెండాలు చేబూని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు అప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేయగా, వాటిని తోసుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ నిరసనలతో ఆయన యోగా డేలో పాల్గొనకుండానే వెనుతిరిగారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం బయట యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.
కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహించాలి: సీతారాం ఏచూరి
విద్యా వ్యవస్ధలో ఈ రకమైన వాణిజ్య ధోరణులు సరికాదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈ అక్రమాలతో కోట్లాది మంది విద్యార్ధుల జీవితాలు బలవుతున్నాయని తెలిపారు. దేశ భవిష్యత్‌కు కీలకమైన యువత భవితకు భరోసా లేకుండా పోయిందని అన్నారు. నీట్ అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలతో పాటు యూజీసీ నెట్ పరీక్షల రద్దు వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ సుస్పష్టమని, వీటిని బహిరంగంగా విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.