పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు 

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల జీవధాన్ ఉన్నత పాఠశాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన పీఈటీ నాగరాజు లైంగికదాడి చేశాడి చేశాడని చిన్నారి తల్లిదండ్రులతో పాటు బంధువులు పాఠశాలలకు చేరుకొని ఆందోళన చేశారు. పాఠశాలలో శనివారం జరిగిన ఈ ఘటనతో పట్టణ పోలీసులు పీఈటీ నాగరాజు పై పోక్సో కేసు నమోదు చేశారు. ఆలస్యంగా విషయం బయటపడడంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం ఆనోటా ఈనోటా వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. దాంతో గొడవ పెద్దదిగా మారింది. అనంతరం విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు పాఠశాలకు చేరుకుని ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ఆందోళనలో పాల్గొని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు తరగతి గదుల్లో ఉన్న పిల్లలను బయటకు పంపడానికి ప్రయత్నించగా విద్యార్థులు భయంతో వణికిపోయారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆందోళనకారులను సముదాయించినా వినకపోవడంతో కాసేపటికి డీఎస్పీ నాగేశ్వర్ రావు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం భోజన సమయం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు లంచ్ బాక్సులు తీసుకుని పాఠశాలకు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. పాఠశాలలో జరిగిన ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థి సంఘాల ఆందోళనలో తల్లిదండ్రులు కూడా పాల్గొనడంతో పాఠశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసుల విఫల ప్రయత్నం – సంఘటన స్థలానికి చేరుకున్న  అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి
పాఠశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ ఫోర్స్ పాఠశాలకు చేరుకుంది. పాఠశాలలో ఉద్రిక్తత నేపథ్యంలో విద్యార్థులను బయటకు పంపించారు. దాంతో వారు  ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ రూంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. జీవధాన్ పాఠశాలలో ఆందోళనకారులను పోలీసులు ఎంత సముదాయించినా వినిపించుకోలేదు. దాంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయమైంది. సీఐతో పాటు పట్టణ ఎస్సై రాజారాం, లింగంపేట ఎస్సె, పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దాంతో పోలీసులు ఆందోళనకారుపై లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్పీ సింధుశర్మలు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు.
Spread the love