– సెబీ చీఫ్ ఉదంతంపై నిపుణుల మనోగతం
న్యూఢిల్లీ: అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్ చేసిన ఆరోపణలకు సంబంధించిన విచారణలో సెబీ చీఫ్ మాధబి బచ్ తన నిర్దోషిత్వాన్ని తానే నిరూపించుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అదానీ గ్రూపుకు చెందిన అనుమానిత ఆఫ్‌షోర్ వాటాదారులపై చర్యలకు సెబీ చీఫ్ సుముఖత చూపలేదని హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై మాధబి, ఆమె భర్త ఇచ్చిన వివరణలపై ఎవరూ సంతృప్తి చెందలేదు. గత కొన్ని సంవత్సరాలుగా అవసరమైన మొత్తం సమాచారన్ని సెబీ ఇప్పటికే బహిర్గతం చేసిందని బచ్ దంపతులు తెలిపారు. అయితే ఆ సమాచారం ఏమిటి, ఎవరికి ఎప్పడు వెల్లడించారు అనే విషయాలను వారే తెలియజేయాల్సి ఉంటుందని మార్కెట్ పరిశీలకులు సూచించారు. సెబీకి పూర్తికాలపు సభ్యురాలు లేదా ఛైర్‌పర్సన్‌ను నియమించినప్పుడు తనకు, తన బంధువులకు ఉన్న వాటాల వివరాలను బయటపెట్టాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ అన్నారు. వాటిలో పరస్పర ప్రయోజనం కలిగిన సమాచారం ఉన్నట్లయితే దానిని కూడా బహిర్గతం చేయాలని చెప్పారు. సింగపూర్‌లో ఓ ప్రైవేటు పౌరురాలిగా నివసిస్తున్న సమయంలో మారిషస్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టానని బచ్ చెబుతున్నారు. అదానీ గ్రూపులో ఆ ఫండ్ ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని కూడా తెలిపారు. అయితే తాను వాటాలు కొనుగోలు చేసిన ఫండ్ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిన తర్వాత అదానీ గ్రూపుపై జరుగుతు్న దర్యాప్తులో బచ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
తన భర్త వాటాలను రీడీమ్ చేయాలని గ్లోబల్ డైనమిక్ ఆపర్ట్యునిటీస్ ఫండ్ మేనేజర్‌కు బచ్ ఎందుకు ఈ మెయిల్ పంపారని క్యాపిటల్ మార్కెట్ విశ్లేషకుడు ఒకరు ప్రశ్నించారు. తన వాటాలను బదిలీ చేసిన తర్వాత వాటిని వదిలేయాలని ఫండ్ మేనేజర్‌ను కోరడం అసాధారణమని ఆయన చెప్పారు. ఆ వాాలు ఇప్పటికీ ఆమె నియంత్రణలోనే ఉన్నాయన్న విషయం దీనినిబట్టి అర్థమవుతోందని తెలిపారు.