– మంత్రి సీతక్కతో కలిసి ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో వీ.సీ ద్వారా సమీక్ష
నవతెలంగాణ – కంఠేశ్వర్
పోడు భూముల పంపిణీకి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి శనివారం మంత్రి కొండా సురేఖ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాలలో ఇప్పటివరకు పోడు పట్టాల కోసం వచ్చిన క్లెయిములు ఎన్ని, వాటిలో ఎంతమందికి ఎన్ని ఎకరాల భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఇంకను ఎన్ని క్లెయిములు పెండింగ్ లో ఉన్నాయి, అందుకు గల కారణాలు ఏమిటి, పట్టాలు పొందిన వారికి భూమి హద్దులు చూపించారా తదితర వివరాలను ఒక్కో జిల్లా వారీగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు రెండు విడతలుగా రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ జరిగినప్పటికీ, ఇంకనూ పలుచోట్ల గిరిజనుల నుండి వినతులు వస్తున్నాయని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పోడు భూములు, పట్టాల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను నిర్ణీత గడువులోపు పంపించాలని సూచించారు.
