– నేడే ప్రమాణ స్వీకారం
– యూనస్ నేతృత్వంలో 15మందితో సలహా మండలి ?
ఢాకా : నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం గురువారం ప్రమాణ స్వీకారం చేస్తుందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. గురువారం రాత్రి 8గంటల సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం వుండవచ్చని చెప్పారు. దాదాపు 15మంది సభ్యులు అడ్వైజరీ కౌన్సిల్‌లో వుండే అవకాశం వుందని కూడా ఆయన తెలిపారు. శాంతియుతంగా వుండాల్సిందిగా దేశ ప్రజలకు యూనస్ విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల హింసకు దూరంగా వుండాల్సిందిగా ఆయన కోరారు. ఇదిలావుండగా, లేబర్ లాకు సంబంధించిన కేసులో యూనస్‌కు విధించిన శిక్షను బంగ్లాదేశ్ కోర్టు రద్దు చేసిందని యూనస్ తరపు న్యాయవాది చెప్పారు.
మరోవైపు, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో హై కమిషన్, కాన్సులేట్‌ల్లోని నాన్ ఎసెన్షియల్ సిబ్బందిని, వారి కుటుంబాలను భారత్ వెనక్కి పిలిపించింది. అయితే దౌత్యవేత్తలందరూ హై కమిషన్‌లోనే వుంటారని, హై కమిషన్ కార్యాలయం యధావిధిగా పనిచేస్తుందని తెలిపింది. రాజధాని ఢాకాలో భారత్ హై కమిషన్ ప్రధాన కార్యాలయం వుండగా, చిట్టగాంగ్, రాజ్‌షాహి, ఖుల్నా, సిల్‌హట్‌ల్లో సహాయ హై కమిషన్‌లు లేదా కాన్సులేట్ కార్యాలయాలు వున్నాయి.
యువతే మన భవిష్యత్తు : ఖలీదా జియా
దేశ పునర్నిర్మాణానికి కావాల్సింది శాంతి, ప్రేమలని, అంతేకానీ ఆగ్రహం లేదా ప్రతీకారం కాదని బిఎన్‌పి ఛైర్‌పర్సన్ ఖలీదా జియా వ్యాఖ్యానించారు. గృహ నిర్బంధం నుండి విడుదలైన ఒక రోజు తర్వాత ఆమె దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేశారు. అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేయడానికి పోరాడిన వారిని అభినందించారు. ఢాకాలోని నయాపల్తాన్‌లో బుధవారం జరిగిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) ర్యాలీలో ఆమె ప్రసంగించారు. యువత చేతిని బలోపేతం చేయాలని ఆమె పిలుపిచ్చారు. యువతే మన భవిష్యత్తు. వారి కలలను సాకారం చేసేందుకు ప్రజాస్వామిక బంగ్లాదేశ్‌ను నిర్మించాల్సిన అవసరం వుందని అన్నారు. ‘విధ్వంసం, ఆగ్రహం, ప్రతీకారం వద్దు, మనకు ప్రేమ, శాంతి అవసరం, వాటితోనే దేశాన్ని పునర్నిర్మిద్దాం” అని పిలుపిచ్చారు. మూడు మాసాల్లోగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సిందిగా బిఎన్‌పి సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లామ్ ఆలంగిర్ డిమాండ్ చేశారు.
మరికొన్ని రోజులు ఢిల్లీలోనే
షేక్ హసీనా మరికొన్ని రోజులు ఢిల్లీలోనే వుంటారని ఆమె కుమారుడు సాజీబ్ వజీద్ బుధవారం తెలిపారు. మరో దేశంలో ఆశ్రయం కోరేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని వచ్చిన వార్తలు కేవలం వదంతులేనని చెప్పారు. ఆమె ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆమె ఒంటరిగా లేరని,తన సోదరి ఆమెతోనే వుందని చెప్పారు.
పారిపోయిన 209 మంది ఖైదీలు
మంగళవారం నాడు మధ్యాహ్నం జరుగుతున్న ప్రదర్శనను అవకాశంగా తీసుకుని గాజిపూర్‌లోని అత్యంత భద్రత వుండే కషింపూర్ జైలు నుండి 209మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. ఖైదీలు పారిపోకుండా నివారించేందుకు జైలు అధికారులు కాల్పులు జరిపారు. ఫలితంగా ఆరుగురు ఖైదీలు మరణించారు.