కేంద్రానికి పిఎస్‌బిల రికార్డ్‌ డివిడెండ్‌

– 2022-23కు గాను రూ.13,800 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్రానికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పిఎస్‌బి) లు అదిరిపోయే డివిడెండ్‌ను అందించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కు వెన్నెముకల ఉన్నా పిఎస్‌బిలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.13,800 కోట్ల డివి డెండ్‌ను ప్రకటించాయి. 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఇంతక్రితం 2021-22లో రూ.9,210 కోట్ల డివిడెండ్‌ను అందించాయి. దీంతో పోల్చితే 2023 మార్చితో ముగిసిన ఏడాదిలో 50 శాతం పెంచి ఇచ్చాయి. ఇంతక్రితం ఎప్పుడూ లేని విధంగా రికార్డ్‌ స్థాయిలో డివిడెండ్‌ను ఇవ్వడం విశేషం. అదే విధంగా 12 పిఎస్‌బిలు 2022-23కు గాను ఈక్విటీ డివిడెండ్‌ కింద 53 శాతం పెంచి రూ.21,000 కోట్లు కేటాయించాయి. ఇది 2021-22లో రూ.13,710 కోట్లుగా ఉంది.
గడిచిన ఆర్థిక సంవ త్సరంలో కేంద్రానికి అత్యధికంగా ఎస్‌బిఐ రూ.5,740 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. కేంద్రానికి అందిన మొత్తం డివిడెండ్‌లో ఎస్‌బిఐ వాటానే 42 శాతంగా ఉంది. 2022-23కు గాను ఆర్‌బిఐ కూడా కేంద్రానికి రూ.87,416 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. గత శుక్రవారం ముంబయిలో ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ 602వ బోర్డు సమావేశంలో తన మిగులు నిధుల్లోంచి రూ.87,416 కోట్లను కేంద్రానికి ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. ఇంతక్రితం 2021-22లో రూ.30,307 కోట్లతో పోల్చితే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ సంస్థల నుంచి బిజెపి సర్కార్‌ భారీ డివిడెండ్‌ను ఆశిస్తోందని తెలుస్తోంది.

Spread the love