మనోవైజ్ఞానిక గుళిక ‘దేశరాజు’ కవిత

Psychic capsule poem 'Desaraj'వర్తమాన కవిత్వం కాలమ్‌ కోసం కవిత్వాన్ని వివిధ సాహితీ పత్రికల్లో చదువుతున్నప్పుడు నాణ్యమైన కవిత్వం కనిపిస్తుంది. అందులో నుండి ఒక కవితను ఎన్నుకోవడం కష్టమవుతుంది. కవులు వారి వారి దృక్పథాల్లోంచి విరివిగా కవిత్వం రాస్తున్నారు. ఆయా సందర్భాల ప్రభావాన్ని బట్టి నేను కవితలను ఎన్నుకోవాల్సి వస్తుంది. మొన్నటి వారం ఆంధ్రజ్యోతి సండే బుక్‌లో దేశరాజు రవికుమార్‌ కవిత చదివాను. నన్ను ఆలోచింపజేసింది.
కవులు సాధారణంగా కవిత్వం రాసేటప్పుడు ఏ సంఘటనను కవిత్వం చేయాలి, దేనిని చేయకూడదు అనే సందేహంలో పడిపోవడం సర్వసాధారణం. ఎన్ని కవితా సంపుటులు రాసిన కవికైనా మరో చక్కని కవిత రాయాలంటే సవాలే. అందుకోసం మన చుట్టూ ఉన్న సంఘటనలను కవిత్వం చేయటం వలన కవికి కొంత శ్రమ తగ్గుతుందని నా భావన. కొంతమంది కవులు ఎంపిక చేసుకున్న విషయం పట్ల పూర్తి అవగాహన లేని పక్షంలో ఎస్కేపింగ్‌ మానర్‌లో కవిత్వం రాయటం చూస్తుంటాం. వస్తువిస్తృతిని పెంచుతూ వ్యాసానికి సరిపడా విషయాలను కవిత్వంలో చేర్చడం గమనిస్తాం. దేశరాజు రాసిన ‘ఎదిగావా’ కవిత అందుకు భిన్నం. చదివితే ఇంత చిన్న విషయాన్ని కవిత్వం చేయొచ్చా అనేలా ఉంది. ఏదో కల్పించుకొని పనిగట్టుకొని రాసినట్టు లేదు.
కవితా శీర్షికలోనే నేటి కాలపు తల్లిదండ్రులకు చురక తగిలించాడు. పిల్లలిప్పుడు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారా? పరతంత్రంగా ఆలోచిస్తున్నారా? అసలు ఆలోచన చేసేంత శక్తి వాళ్ళ దగ్గరుందా? ఏది ఎందుకు చేయాలో, చేయకూడదో తెలిసేంత విచక్షణ వాళ్ళల్లో ఉందా? అనేవి ఈ కాలంలో కలవరపెడుతున్న ప్రశ్నలు. వీటికి సమాధానం ఈ కవితలో దొరుకుతుంది. ‘ఎదిగావా’ అనే శీర్షిక అంతరార్థం గమనిస్తే పిల్లల స్థాయికి అనుగుణంగా దిగావా అన్నట్టు తోస్తుంది. కవి అడిగినట్టు ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.
పిల్లలకు తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించి వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన సమయమిది. పిల్లలు కౌమారదశలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధత ఉంటుంది. ఒత్తిడికి కూడా లోనవుతారు. ఆ సందర్భంలో ఖచ్చితంగా గైడ్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి అవసరాన్ని గుర్తించి కవి ఎత్తుగడలో ఈ మాటలనుంటాడు.
”నీ ఎదిగిన కొడుకుని ఎప్పుడైనా../ హృదయానికి హత్తుకున్నావా?” అని. ఈ పోయెమ్‌ నడిపించిన విధానం చూసిన తర్వాత నాకు ఈ కవితను మనోవైజ్ఞానిక గుళిక అని అనాలనిపిస్తుంది.
తండ్రి ఒక స్నేహితుడులా ప్రవర్తించాల్సిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎప్పుడూ నియంతృత్వంగానే ఉంటే పిల్లలు వారి బాధలను, సంతోషాలను పంచుకునే పరిస్థితి కనిపించదు. అలాంటి సందర్భంలో కవి ”వాడి మూతి మీద మొలుస్తున్న మీసాన్ని/ నీ చూపుడు వేలితో అలా/ అలవోకగా దువ్వావా” అంటూ స్నేహపూర్వక వాతావరణాన్ని పిల్లలతో ఎలా సృష్టించుకోవొచ్చో తెలిపాడు.
పిల్లలు సున్నితమైన మనస్కులు. నచ్చిన ఛానల్‌ పెట్టనివ్వలేదని ఆత్మహత్య చేసుకునేంత బుర్రలేనివాళ్ళు. వాళ్ళను ధైర్యవంతులను, స్థితప్రజ్ఞులుగా తయారు చేసే బాధ్యత తండ్రిదే. సమాజాన్ని గమనిస్తున్న చూపుతో కవి ఇందులో ఎన్నో అంశాలను మేళవింపు చేశాడు. వాళ్ళ కలలు సాకారం కానప్పుడు తోడుగా నిలబడమంటూ, వారు విజయం సాధించటంలో కొన్ని ఆలోచనలను అందిస్తూ, ఏదైనా సాధించినప్పుడు పిల్లలను ప్రశంసిస్తూ ఉండాలని హితవు పలికాడు.
ముగింపులో కవి వేసిన ప్రశ్న ఆలోచనాత్మకమైనది. ఈ రోజుల్లో మనుషులు ఎంతగా బిజీ అయ్యారంటే ఎదురింట్లో ఉంటున్న వ్యక్తుల ముఖాలు కూడా గుర్తుపట్టనంతగా. తినడానికి కూడా సమయం కేటాయించకుండా వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మునిగిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో కాస్త వెసులుబాటు చూసుకోమంటున్నాడు ఈ కవి. సండే డాడీలా కాకుండా అప్పుడప్పుడయినా పిల్లల బాగోగులను పట్టించుకోమంటున్నాడు. పిల్లలు ఏ మాదకద్రవ్యాలవైపుకో, చెడుదారుల వైపుకో అడుగులేస్తే ఎంత బాధపడ్డా ఏం లాభం? అందుకోసమే నీ ఎదిగిన కొడుకును అందుకోగలిగే ఎత్తుకు నువ్వు ఎదిగావా? అంటూ కవి ప్రశ్నిస్తున్నాడు. ఎవరికి వారే మనసు ఆన్సర్‌ షీట్‌లో వ్యాసరూప సమాధానం రాయాల్సిందే ఇక.

ఎదిగావా?
నీ ఎదిగిన కొడుకుని ఎప్పుడైనా..
హృదయానికి హత్తుకున్నావా?
వాడి మూతిమీద మొలుస్తున్న మీసాన్ని
నీ చూపుడు వేలితో అలా…
అలవోకగా దువ్వావా?
పొగరుగా ఎగిరిపడుతున్న వాడి గుండెల్నీ
అందులోని అలల నురుగుల్నీ…
అరచేత్తో ప్రేమగా నిమిరావా?
కలలు పిగులుతున్న వాడి కళ్లల్లోకి…
పగిలిన పెంకుల్లాంటి గుడ్లతో దృష్టిసారించావా?
విడిచిన బాణాల్లా విచ్చుకునే…
వాడి చేతివేళ్లలోకి
నలిగిన నారిలాంటి నీ ఆలోచనలు
సంధించావా?
కలలు గీరుకుని నెత్తురోడుతున్న
వాడి చెంపలను ఎప్పుడైనా పుణికావా?
చెడ్డీ పదేపదే లాగి దాచిన వాడి పిర్రలపై
అభినందిస్తూ ఒక్కసారైనా గట్టిగా చరిచావా?
పేలని జోకేదో వేసి, వాడి కళ్లల్లోకి చూస్తూ
నువ్వే పక్కున పగలబడి నవ్వావా?
నువ్వు నీ ఎదిగిన కొడుకును అందుకోగలిగే ఎత్తుకు –
నిజంగా ఎదిగావా? – దేశరాజు
– డా||తండా హరీష్‌, 8978439551

Spread the love