– మల్లిఖార్జున ఖర్గే హాజరు 29న వరంగల్‌లో మైనార్టీ డిక్లరేషన్
– ఓబీసీ, మహిళా డిక్లరేషన్ కోసం సబ్ కమిటీ
– సోనియాగాంధీ చేతుల మీదుగా ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
– ప్రతీ గడపకూ చేరాలి… ప్రతీ తలుపూ తట్టాలి
– టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎన్నికలకు కాంగ్రెస్ వడివడిగా అడుగులేస్తున్నది. అందులో భాగంగా వివిధ వర్గాలకు సంబంధించిన డిక్లరేషన్లు విడుదల చేయాలని టీపీసీసీ విస్తృతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించింది. ఎన్నికల తుది మ్యానిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు. ఈనెల 26న సాయంత్రం నాలుగు గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించాలని తీర్మానించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నట్టు టీపీపీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రేవంత్ మాట్లాడారు. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను విడుదల చేస్తారని వివరించారు. ఈ నెల 21 నుంచి 25 వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘తిరగబడదాం…తరిమికొడదాం’ అనే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ప్రతీ గడపకు పోవాలనీ, ప్రతీ తలుపు తట్టేలా చూడాలని కోరారు. ఇందుకోసం నియమించిన పార్లమెంట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ప్రయత్నం చేయాలని సూచించారు. ఈనెల 29న మైనార్టీ డిక్లరేషన్‌ను వరంగల్‌లో విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామన్నారు. మహిళా డిక్లరేషన్ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీని ఆహ్వానిస్తామన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నెలరోజులపాటు విస్తృతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, ఆ తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుందో ప్రజలకు వివరిస్తామన్నారు. అనంతరం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై మరో చార్జిషీట్ విడుదల చేస్తామని తెలిపారు.
ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ : రేవంత్ హామీ
వచ్చేది ఇందిరమ్మ రాజ్యమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. జెండాలను, అజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పాలమూరు ప్రజలకు రేవంత్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం బిజినేపల్లి మండలానికి చెందిన సర్పంచులు వెంకటస్వామి, అమృత్‌రెడ్డి, తిరుపతయ్య, ఎంపీటీసీ అంజి, మాజీ సర్పంచులు అలియా నాయక్, రాంచందర్, మాజీ ఎంపీపీ రాములు, వార్డు సభ్యులు, కార్యకర్తలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పాలమూరు జిల్లాలో 14సీట్లకు 14 గెలిపిస్తే…రాష్ట్రంలో వంద సీట్లు గెలిపించే బాధ్యత తమదేనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని రేవంత్ వివరించారు.
ఓబీసీలకు 48 సీట్లు ఇవ్వాలి – రేవంత్‌కు కత్తి వెంకటస్వామి విజ్ఞప్తి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని ఓబీసీలకు 48 సీట్లు కేటాయించాలని ఓబీసీ జాతీయ నేత కత్తి వెంకటస్వామి కోరారు. ఈమేరకు శనివారం గాంధీభవన్‌లో రేవంత్‌ను కలిసి కోరినట్టు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. అంతకు ముందు గాంధీభవన్‌లో ఓబీసీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం కత్తి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల వైపు బీసీలు చూస్తున్నారని తెలిపారు. వారు కాంగ్రెస్ వైపు మళ్లాలంటే తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. బీసీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వారినే నిలబెట్టాలని డిమాండ్ చేశారు. పోటీ చేసేందుకు 65మంది పైగా బీసీ నేతలు ఉన్నారని తెలిపారు. వారంతా ఆర్ధికంగా బలంగా ఉన్నారని చెప్పారు.