– సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ-కల్చరల్
సమాజంలో ఉన్న పేద, ధనిక వర్గ భేదాలను రూపు మాపేందుకు ఉద్యమించిన ఉద్యమశీలి, గొప్ప త్యాగధనుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై గానసభ నిర్వహణలో శతాబ్ది పూర్వ మహనీయులు యాదిలో భాగంగా పుచ్చలపల్లి సుందరయ్య సంస్మరణ సమావేశం సోమవారం జరిగింది. నంద్యాల నర్సింహారెడ్డి పాల్గొని సుందరయ్య చిత్ర పటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యునిగా సైకిల్‌పై వెళ్లిన సుందరయ్య నిరాడంబరత, ఇతరుల సమస్యల పరిష్కారంలో సహనంతో వ్యవహరించటం కామ్రేడ్‌కు ప్రతీక అన్నారు. కుటుంబం ఉంటే బంధాలతో స్వార్ధం పెరుగుతుందన్న ఆలోచనతో సంతానం వద్దనుకున్న త్యాగశీలి సుందరయ్య అని కొనియాడారు. ఆ మహనీయున్ని స్మరించుకొని నేటి తరానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్న గానసభను అభినందించారు. గీత రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ.. సుందరయ్య వేసిన బాటలో సీపీఐ(ఎం), ప్రజాశక్తి పత్రిక సమాజంలో ప్రగతిశీల చైతన్యవంత ఉద్యమాల కోసం పనిచేస్తున్నాయని కొనియాడారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించిన వేదికపై విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్, తిరువాణి చంద్రశేఖర్ పాల్గొన్నారు.