నవతెలంగాణ – బెంగళూరు: బెంగళూరులో కొత్త రకం మాఫియా పుట్టుకొచ్చింది. అదేంటంటే పంక్చర్ మాఫియా.. అవునండీ.. ఇప్పుడిది నగరంలో క్రియాశీలకంగా మారింది. పంక్చర్ దుకాణం ఉన్న చోటుకు ఒక కిలోమీటర్ పరిధిలో రహదారులు, కూడళ్ల వద్ద చిన్న మేకులు, మొనదేలి ఉన్న తీగలను కొందరు దుండగులు పడేస్తారు. ఇవి గుచ్చుకోగానే టైర్లు, ట్యూబులు పంక్చర్ అవుతాయి. దీంతో కొందరు నగదు సంపాదించుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయి. అశోకనగర ఠాణాలో ట్రాఫిక్ ఎస్సై మహ్మద్ ఇమ్రాన్ అలీ రహదారులపై పడి ఉన్న మేకులు, చువ్వలు తొలగిస్తూ, వాహనదారులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆనేపాళ్య, నంజప్ప కూడలి, అపేరా జంక్షన్ చుట్టుపక్కల నిత్యం కిలోకు పైగా మేకులు, ఇనుప తీగలను వీరు సేకరిస్తున్నారు. రహదారులు, దత్తపీఠానికి వెళ్లే మార్గంలోనే మేకులు వేసే మాఫియా ఉంది. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే ఇలాంటి మాఫియాను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.