నవతెలంగాణ – హైదరాబాద్: మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్వహణలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న పీవీఆర్ సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. వరుస నష్టాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించింది. థియేటర్ల నిర్వహణ వ్యయం పెరగడం, ఆదాయం తగ్గడంతో పాటు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడడంతో కొంతకాలంగా పీవీఆర్ నష్టాలు చవిచూస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి మార్చి వరకు దాదాపు రూ.333 కోట్లు నష్టం వాటిల్లిందని పీవీఆర్ సంస్థ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో వంద కోట్లకు పైగా నష్టపోయినట్లు వివరించాయి. ఈ నేపథ్యంలోనే స్కీన్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.