నాణ్యమైన బౌలర్లే కీలకం

Quality bowlers are key– పాక్‌ వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఉత్తమ బౌలింగ్‌ వనరులు కలిగిన జట్టే 2023 ఐసీసీ ప్రపంచకప్‌ విజయం సాధించగలదని పాకిస్థాన్‌ వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ అన్నాడు. వరల్డ్‌కప్‌ వేట కోసం హైదరాబాద్‌కు వచ్చిన పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు.. తొలిసారి మీడియాతో మాట్లాడింది. శుక్రవారం జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన పాకిస్థాన్‌..మంగళవారం ఆస్ట్రేలియాతో మరో వార్మప్‌లో పుంజుకునేందుకు సిద్ధమవుతోంది. ‘ ప్రస్తుతం మా ఫోకస్‌ ఆసీస్‌తో వార్మప్‌, హైదరాబాద్‌లో రెండు ప్రధాన మ్యాచ్‌లపైనే ఉంది. అహ్మదాబాద్‌లో భారత్‌తో పోరు గురించి ఇప్పుడే ఆలోచన లేదు. ప్రపంచకప్‌ ఫార్మాట్‌ సవాల్‌తో కూడున్నది. నాణ్యమైన బౌలింగ్‌ కలిగిన జట్టునే విజయం వరిస్తుందని నా అభిప్రాయం. ఇక్కడ పిచ్‌లు ఫ్లాట్‌గా ఉన్నాయి. బౌండరీలు చిన్నగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బౌలింగ్‌ అంత సులభం కాదు. బ్యాటర్లను పరుగుల వేటలో నిలువరించి వికెట్లు తీయటం కఠిన సవాల్‌. మెరుగ్గా బౌలింగ్‌ చేసిన జట్టు విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. పాకిస్థాన్‌కు బలమైన బౌలింగ్‌ విభాగం ఉంది. ప్రపంచకప్‌లో మంచిగా రాణిస్తామనే నమ్మకం ఉంది. భారత్‌లో వేదిక మారే కొద్ది పరిస్థితులు మారుతాయి. అందుకు తగినట్టుగా వేగంగా పరిస్థితులకు అలవాటు పడటం కీలకం. సుదీర్ఘ టోర్నీలో ఫాస్ట్‌ బౌలర్ల ఫిట్‌నెస్‌ నిలుపుకోవటం అన్ని జట్లకూ కీలకమే. హైదరాబాద్‌లో పిచ్‌ రావల్పిండి పిచ్‌ తరహాలో అనిపించింది’ అని షాదాబ్‌ ఖాన్‌ అన్నాడు. టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు బౌలింగ్‌ వేయటం అంత సులువు కాదు. అతడు క్రీజులో కుదురుకుని పరుగుల వేట మొదలెడితే ఆపటం ఎవరి తరం కాదు. అత్యంత ప్రమాదకార బ్యాటర్‌ రోహిత్‌ శర్మ. భారత జట్టులో నేను అభిమానించే ఆటగాడు సైతం రోహిత్‌ శర్మ. బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ను ఇష్టపడతానని షాదాబ్‌ ఖాన్‌ తెలిపాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో సాధన చేసింది.

Spread the love