– 24 గంటల విద్యుత్ సరఫరాలో దేశంలోనే ఆదర్శం
– 9ఎండ్లాల్లో తెలంగాణ ప్రగతి..
– స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి .
నవతెలంగాణ -నసురుల్లాబాద్ (బాన్సువాడ)
తొమ్మిది ఏండ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలెన్నో కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి. 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను తొమ్మిది ఏండ్లల్లో తెలంగాణ సాధించిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా నేడు బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లో జరిగిన బాన్సువాడ నియోజకవర్గం విద్యుత్ ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్తు సరఫరాలో, తాగునీరు, సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక, ఐటి రంగాల ప్రగతిలో… ఇలా అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణమని స్పీకర్ అన్నారు. అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచిందన్నారు. తొమ్మిదిదేళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశా నిర్దేశనం చేసే కరదీపికగా మారిందన్నారు. ప్రజలందరి దీవెన, ప్రభుత్వ అధికారుల, సిబ్బంది అంకితభావం వల్లనే ఇదంతా సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 లో మన విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు. లోటు 2700 మెగావాట్లుగా ఉండేది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదల, ప్రణాళికలతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2023 నాటికి 18, 567 మెగావాట్లకు చేరుకుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 2014 తరువాత రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల పటిష్టం, విస్తరణకు 97, 321 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, గృహ, వ్యవసాయ రంగాలకు సబ్సిడీలకు రూ. 50,వేల కోట్ల ఖర్చు అయిందన్నారు. విద్యుత్తు కావలసినంత అందుబాటులో ఉండడంతో గృహాలకు, వ్యవసాయానికి, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. 2014 లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లు. ఈరోజు రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2140 యూనిట్లకు చేరిందని. ఇది జాతీయ సగటు 1255 యూనిట్ల కంటే 70 శాతం అధికం అన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి ఉచితంగా కరంటు సరఫరా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 27.49 లక్షల వ్యవసాయ కరంటు మోటార్లు ఉన్నాయని. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కోసం ఏటా 12, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అంటే ప్రతి రైతుకు రూ. 40,000 సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, సరఫరా కోసం 525 కోట్లు ఖర్చు చేశామన్నారు. దామరంచలో 70 కోట్ల రూపాయలతో 220 కేవి, సబ్ స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో 43 వేల విద్యుత్ మోటార్లు ఉన్నాయి. వీటి కోసం ఏటా సుమారుగా రూ. 170 కోట్ల సబ్సిడీగా ఖర్చు అవుతుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచ్ లు ఫోటోలు, వీడియోలు తీసి ప్రజలకు వివరించాలని సూచించారు. గత పది సంవత్సరాల ప్రజా జీవితం నాకు సంతృప్తి ఇచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అన్నింటినీ నెరవేర్చాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్సువాడ పురపాలక సంఘం అధ్యక్షుడు జంగం గంగాధర్, ఆర్డీవో రాజా గౌడ్, డిఎస్పీ జగన్నాధ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.