ఉన్నత విద్యామండలి చైర్మెన్‌గా ఆర్‌ లింబాద్రి

– వైస్‌ చైర్మెన్‌గా ఎస్‌కె మహమూద్‌ నియామకం
– మూడేండ్లపాటు పదవిలో కొనసాగనున్న వైనం
– ఉత్తర్వులు విడుదల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మెన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవోనెంబర్‌ 42ను సోమవారం విడుదల చేశారు. లింబాద్రి ప్రస్తుతం ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జీ చైర్మెన్‌గా, వైస్‌ చైర్మెన్‌-1గా, డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కన్వీనర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తుమ్మల పాపిరెడ్డికి 65 ఏండ్లు దాటినా ఉన్నత విద్యామండలి చైర్మెన్‌గా కొనసాగించడంతో హైకోర్టులో ఓయూ జేఏసీ నేత కురువ విజరుకుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పాపిరెడ్డిని ప్రభుత్వం తొలగించింది. ఆ క్రమంలో 2021, ఆగస్టు 24న లింబాద్రిని ఇన్‌చార్జీ చైర్మెన్‌గా నియమించింది. తాజాగా ఆయన్ను పూర్తిస్థాయి చైర్మెన్‌గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగుతారని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పడిన తర్వాత 2014, ఆగస్టు 5న తొలిచైర్మెన్‌గా తుమ్మల పాపిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. 2021, ఆగస్టు 24 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. అయితే 2017, ఆగస్టు 3న ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్లుగా ఆర్‌ లింబాద్రి, వి వెంకటరమణను ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైస్‌చైర్మెన్‌గా, దోస్త్‌ కన్వీనర్‌గా లింబాద్రి కొనసాగారు. ఈనెలలోనే ఆయన ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌గా కొనసాగుతారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అనే చర్చ విస్తృతంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లింబాద్రినే చైర్మెన్‌గా మళ్లీ నియమించి ఊహాగానాలకు చెక్‌పెట్టింది. ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) బాటనీ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌కె మహమూద్‌ను నియమించింది. ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగుతారు.
ఉన్నత విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తా : లింబాద్రి
ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి నూతన చైర్మెన్‌ లింబాద్రి నవతెలంగాణతో మాట్లాడుతూ చైర్మెన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కె తారక రామారావు, పి సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం దార్శనికత, లక్ష్యానికి అనుగుణంగా విద్యారంగంలో మార్పుల కోసం పనిచేస్తామని అన్నారు.
ఆరేండ్లపాటు ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌గా, సుమారు రెండేండ్లపాటు చైర్మెన్‌గా బాధ్యతలను నిర్వహించానని చెప్పారు. తెలంగాణలో ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరింత కృషి చేస్తామన్నారు. దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. విశ్వవిద్యాలయాలను, ఉన్నత విద్యాశాఖను సమన్వయం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంజినీరింగ్‌, డిగ్రీలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరేలా వారికి ఉపాధి అవకాశాలు లభించేలా పలు నిర్ణయాలను తీసుకుంటున్నామని వివరించారు.

Spread the love