నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన స్పందిస్తూ.. సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు. వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉండే గొప్ప నేత అన్నారు. త్యాగం, వారసత్వం, పోరాటమే ఆయన ధ్యేయమన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. సీఎంతో పాటుగా పలువురు రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నాయకులు ఆయనకు సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే రాహుల్ గాంధీ తన పుట్టిన రోజున సందర్భంగా స్పందిస్తూ.. గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. సెలబ్రేషన్స్‌కు బదులుగా పేదలకు మానవ సాయం చేయాలని కాంగ్రెస్ కార్తకర్తలకు పిలుపునిచ్చారు. బ్రదర్ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన ఎక్స్ పోస్టులో తెలిపారు. దేశ ప్రజల క్షేమం కోసం మీరు తీసుకున్న దీక్ష మిమ్మలను ఉన్నత స్థాయికి చేరుస్తుందని స్టాలిన్ తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ కూడా రాహుల్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు.