రారుబరేలీకే రాహుల్‌గాంధీ

Rahul Gandhi in Rarubareeli– వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ పోటీ
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌, రారుబరేలీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ రారుబరేలీ ఎంపీగా కొనసాగనున్నట్టు ప్రకటించారు. రెండు నియోజకవర్గాల్లో ఒక సీటును వదులుకోవాల్సి రావడంతో ఆయన వయనాడ్‌ సీటును వదులుకున్నారు. సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్‌ నియోజకవర్గాన్ని రాహుల్‌ ఖాళీ చేయడంతో అక్కడ జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీని పోటీలోకి దింపాలని ఆ పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రియాంక గాంధీ ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కానుంది. ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌ పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌లో పోటీ చేయగా అమేథీలో ఓడిపోయారు. వయనాడ్‌ నుంచి ఘనవిజయం సాధించారు. ఇక రాయబరేలీ నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న సోనియాగాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరమవు తున్నట్టు ప్రకటించారు. దీంతో అటు వయనాడ్‌తో పాటు ఇటు రాయబరేలీ నుంచి వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ను బరిలోకి దింపింది. అందుకు తగ్గట్టే ఆయన ఈ రెండు నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి రావడంతో కాంగ్రెస్‌ సోమవారం ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.
ప్రియాంక గెలుపు ఖాయం
వయనాడ్‌ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనుండడంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. కేరళ ప్రజలకు ప్రియాంక అంటే చాలా ఇష్టమని, ఆమె భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు.

Spread the love